పెద్ద సారూ.. పాఠం చెప్పరు!

school headmasters are not teaching in schools - Sakshi

నిబంధనలను పట్టించుకోని హెడ్మాస్టర్లు

ఇతర వ్యాపకాల్లో బిజీబిజీ

ఒక్క పీరియడ్‌ కూడా చెప్పని వారెందరో..

చర్యలు తీసుకోని విద్యాశాఖ

పెద్ద సార్లు పని తప్పించుకుంటున్నారు! పాఠాలు బోధించకుండా వేరే వ్యాపకాల్లో మునిగి తేలుతున్నారు. పలువురు హెడ్మాస్టర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పుస్తకాలు పట్టట్లేదు.. పిల్లలకు పాఠాలు చెప్పట్లేదు. వాస్తవానికి ఇతర ఉపాధ్యాయులతో పాటు ప్రధానోపాధ్యాయుడు సైతం విద్యార్థులకు తప్పనిసరిగా పాఠాలు బోధించాలి. కానీ జిల్లాలో చాలా పాఠశాలల్లో హెచ్‌ఎంలు బోధనకు దూరంగా ఉంటున్నారు. ఇతర వ్యాపకాల్లో బిజీగా మారడంతో విద్యాబోధన గాడి తప్పుతోంది. ఫలితంగా విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే, వివిధ పనుల ఒత్తిళ్ల కారణంగా పాఠాలు బోధించడం లేదని కొందరు హెచ్‌ఎంలు బహిరంగంగానే చెబుతుండడం విశేషం.

కామారెడ్డి టౌన్‌: హెడ్మాస్టర్లు పాఠ్యాంశాల బోధనకు మంగళం పాడేశారు. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన హెచ్‌ఎంలు.. ఇతర వ్యాపకాలతో గడుపుతున్నారు. జిల్లాలో దాదాపు 80 శాతం మంది ప్రధానోపాధ్యా యులు బోధనకు దూరంగా ఉంటుండగా, కేవలం 20 శాతం మంది మాత్రమే నిజాయతీగా పాఠాలు చెబుతున్నట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు.

ఎనిమిది పీరియడ్లు బోధించాలి
జిల్లాలో 730 ప్రాథమిక, 217 ప్రాథమికోన్నత, 314 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 4,916 టీచర్‌ పోస్టులకు గాను 4,077 మంది విధులు నిర్వహిస్తున్నారు. 819 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్నత పాఠశాలల్లో 307 మంది హెడ్మాస్టర్లు పని చేస్తున్నారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం ప్రతీ ప్రధానోపాధ్యాయుడు తప్పనిసరిగా వారానికి 8 పీరియడ్లు బోధించాలి. 6 నుంచి 10వ తరగతి వరకు ఏదో ఒక పీరియడ్‌ 45 నిమిషాల పాటు బోధించాల్సి ఉంటుంది.

అయితే, స్కూల్‌ టైం టేబుల్‌లో తమకు పీరియడ్లు ఉన్నాయని చూపించుకుంటున్నారే తప్పితే చాక్‌పీస్‌ పట్టి పాఠాలు చెప్పింది లేదు. కొందరు ఒకటి, రెండుపీరియడ్లు బోధించి మమ అనిపిస్తుంటే, మరికొందరైతే, తరగతి గదుల ముఖమే చూడట్లేదు. 307 మంది హెచ్‌ఎంలలో 80 శాతం మంది అసలు పాఠ్యపుస్తకాలు, బ్లాక్‌బోర్డు, చాక్‌పీస్‌ను పట్టడం లేదని ఆరోపణలున్నాయి. కేవలం 20 శాతం మంది మాత్రమే పాఠాలు బోధిస్తున్నట్లు సమాచారం. ఉపాధ్యాయులు రానప్పుడు వారి స్థానంలో బోధిస్తూ తమ పీరియడ్లుగా బోధించినట్లుగా రికార్డుల్లో చూపిస్తున్నారు కానీ ప్రత్యేకంగా వారు తీసుకోవాల్సిన పీరియడ్లును మాత్రం తీసుకోవడం లేదు.

ఉపాధ్యాయ సంఘాలు, ఇతర పనుల్లో.....
జిల్లాలో పదికి పైగానే ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల్లో హెచ్‌ఎంలు సైతం పెద్ద నాయకులుగా ఉన్నారు. దీంతో సంఘాల పనుల్లో బిజీబిజీగా ఉంటున్న హెడ్మాస్టర్లు పాఠాలు ఎగ్గొడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంఘాల పేరుతో ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని విధులను విస్మరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, కొందరు హెచ్‌ఎంలు వ్యాపారాలు, ఫైనాన్స్‌లు, రియల్‌ దందాలను నిర్వహిస్తున్నారు. తమ సొంత పనుల్లో బిజీగా ఉంటూ బోధనలను విస్మరిస్తున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

పట్టించుకోని ఉన్నతాధికారులు
ఉపాధ్యాయ సంఘాల పేరుతో ఉన్నతాధికారులనే శాసించే స్థాయికి కొందరు చేరడంతో వారి విషయంలో అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో అసలు హెచ్‌ఎంలు పాఠాలను బోధించకున్నా పట్టనట్లు వ్యవహిస్తున్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క స్కూల్‌లోనూ హెచ్‌ఎంలు బోధించేలా చర్యలు తీసుకున్నట్లు లేదు. వాస్తవానికి విద్యా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి విద్యార్థులు, ఉపాధ్యాయులను విచారిస్తే హెచ్‌ఎంల బండారం బట్టబయలవుతుంది. కానీ, అధికారులు మాత్రం విచారణకు వెనుకడుగు వేస్తున్నారు.

హెచ్‌ఎంలు తప్పనిసరిగా బోధించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో హెచ్‌ఎంలు సైతం వారానికి తప్పకుండా ఎనిమిది పీరియడ్లు బోధించాలి. కొత్త జిల్లా కావడంతో వారు కాస్త పని ఒత్తిడిలో ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తప్పనిసరిగా పాఠాలు బోధించాలి. పాఠాలు చెప్పని వారిపై చర్యలు తీసుకుంటాం.
– మదన్‌మోహన్, డీఈవో, కామారెడ్డి

Read latest Nizamabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top