
సెలూన్‌లో అభినందన్ లాగా మీసాలు కట్ చేయించుకుంటున్న యువకుడు
బొమ్మనహళ్లి : పాక్ చెర నుంచి విడుదలైన భారత వాయుసే వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మీసాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆయన మీసకట్టు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. అనేక మంది యువత ఆయన తరహా మీసాలను ఇష్టపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం శత్రుదేశ విమానాన్ని తరుముతూ సరిహద్దు దాటి పాకిస్తాన్‌కు చిక్కిన భారత వైమానిక దళ పైలెట్ అభినందన్ వర్ధమాన్ ధైర్య సాహసాలు, మీసాలు ఆయన స్టైల్‌ను సూపర్ బ్రాండ్‌గా మార్చాయి.
బెంగళూరు యువతలో అభి మీసాల క్రేజ్ పెరిగిపోయింది. ఆ తరహా మీసకట్టు కోసం క్షౌరశాలలకు వెళ్తున్నారు. ఇందుకు నిదర్శనంగా నగరానికి చెందిన ఓ సేల్స్‌మెన్ చాంద్ మహ్మద్ అభినందన్ ఫ్యాన్‌గా మారిపోయాడు. దీంతో ఆయన లాగా మీసాలను సెట్ చేయించుకున్నాడు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ... అభినందన్ ధైర్య, సాహసం ఆయన మీసకట్టులోనే ఉందని, చివరకు పాక్ సైనికులు కూడా భయపడ్డారని అన్నారు.
గతంలో బాలీవుడ్ హీరోల తరహాలో గడ్డం, మీసాలు ఉండేవని, ఇప్పుడు రియల్ హీరో అభినందన్ స్పూర్తితో ఆయన తరహా మీసకట్టు పెట్టుకున్నట్లు తెలిపారు. హెయిర్ సెలూన్ యజమాని సమీర్ ఖాన్ మాట్లాడుతూ... తన వద్దకు రోజు 15 మందికి పైగా యువత అభినందన్ మీసకట్టు చేయించుకుని వెళ్తున్నారని అన్నారు. అభినందన్ మీసకట్టు కోసం వచ్చే వారికి 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.