
సాక్షి, బెంగళూరు: కన్నడతో పాటు తెలుగు సినీరంగంలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ‘కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ (కేపీజేపీ)’ పేరిట రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన మంగళవారం ప్రకటించారు. బెంగళూరులోని గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉపేంద్ర పార్టీ ప్రకటన చేశారు. డ్రెస్‌కోడ్‌ను ఖాకీ యూనిఫాంగా నిర్ణయించినట్లు చెప్పారు. తమ పార్టీలో చేరాలనుకునే వారికి డబ్బు అవసరం లేదని, కేవలం కొత్త ఆలోచనలు, ప్రజల కోసం కష్టపడే తత్వం ఉంటే చాలని ఉపేంద్ర అన్నారు.
అన్ని సీట్లలో పోటీ చేస్తాం
వచ్చే ఏడాది జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 224 నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తామని ఉపేంద్ర తెలిపారు. ‘ఇక్కడ మీరు ఉపేంద్రను నమ్మాల్సిన అవసరం లేదు. నా సిద్ధాంతాన్ని నమ్మండి. ఇతర పార్టీల వాళ్లు డబ్బులిస్తే తీసుకోండి. ఎందుకంటే అది మీ డబ్బే కాబట్టి. నేను ఎంజీఆర్, ఎన్టీఆర్, చిరంజీవి, పవన్‌కళ్యాణ్ కాలేను. నేను ఉపేంద్ర లాగే ఉంటాను’ అని ఉపేంద్ర ఉద్వేగంగా మాట్లాడారు.