నాగేశ్వర్‌ రావు ఎవరో తెలుసా?

Who is Nageshwar Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్:  కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తాత్కలిక డైరెక్టర్‌గా నియమితులైన మన్నెం నాగేశ్వరరావు స్వస్థలం తెలంగాణలోని జయశంకర్‌ జిల్లా(ఉమ్మడి వరంగల్) మండపేట మండలం బోర్‌నర్సాపూర్ గ్రామం. 1986వ బ్యాచ్‌ ఒడిశా కేడర్‌ ఐపీఎస్‌ అధికారైన ఆయన ఏడాదిన్నరగా సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సీబీఐ డైరక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరక్టర్ రాకేశ్ ఆస్థానా మధ్య నెలకొన్న అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో సీబీఐ డైరక్టర్‌గా అలోక్ వర్మను తొలగిస్తూ ఆ స్థానంలో నాగేశ్వర రావును ప్రధానమంత్రి నరేంద్రమోదీ నియమించిన విషయం తెలిసిందే. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీ పీజీ పట్టా అందుకున్న నాగేశ్వరరావు ఐపీఎస్‌ అధికారి కాకముందు ఐఐటీ మద్రాస్‌లో పరిశోధకుడిగా పనిచేశారు. ( చదవండి: అవినీతి ఆరోపణలున్న వ్యక్తి సీబీఐ డైరెక్టరా?)

ఒడిశా కేడర్‌ ఐపీఎస్‌గా ఎంపికైన అనంతరం ఆయన తన తొలి పోస్టింగ్‌ను ఒడిశా తాల్చెర్‌ సబ్‌డివిజనల్‌ పోలీస్‌ ఆఫీసర్‌(ఎస్డీపీవో)గా అందుకున్నారు. అనంతరం ఒడిశాలోని నాలుగు జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. అలాగే రూర్కెలా రైల్వేస్‌ ఎస్పీగా, క్రైమ్‌ బ్రాంచ్‌ ఎస్పీగా కూడా విధులు నిర్వహించారు. ఒడిశాలో డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింట్‌ ఉపయోగించిన తొలి పోలీస్‌ అధికారిగా గుర్తింపు పొందారు. 1996 జగస్తింగ్‌పూర్‌లోని ఓ రేప్‌ కేసులో ఫింగర్‌ ప్రింట్స్‌ ద్వారా నేరస్థులను పట్టుకున్నారు. క్రైమ్‌ బ్రాంచ్‌ ఎస్పీగా ఉన్నప్పుడు కటక్‌లో 200 మందిని చంపిన నేరస్థుడు బెలుదాస్‌ను కూడా అరెస్ట్‌ చేశారు. ఆయన ఒడిశా ఫైర్‌ సర్వీస్‌ ఉన్నతాధికారిగా కూడా పనిచేశారు. ఆ సమయంలో ఫైలిన్‌(2013) హుదూద్‌ (2014) తుఫానుల్లో చేపట్టిన సహయక చర్యలకుగాను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి అవార్డులందుకున్నారు. ఆయనందించిన విశేష సేవలకుగాను రాష్ట్రపతి, ఒడిశా గవర్నర్‌ల చేతుల మీదుగా మెడల్స్‌ కూడా లభించాయి. ఆయన సీఆర్పీఎఫ్‌ మణిపూర్‌ డీఐజీగా కూడా పనిచేశారు. (చదవండి: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా తెలుగు వ్యక్తి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top