ఢిల్లీ కాలుష్యానికి ఎవరు కారకులు?

what is the reason for air pollution in delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో కాలుష్యానికి అసలు కారణం పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట దుబ్బలను తగుల పెట్టడమేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ ఆరోపించడం, అసలు ఆయన ఐఐటీ గ్రాడ్యువేట్‌ ఎల అయ్యారంటూ పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌ విరుచుకు పడడం తెల్సిందే. వారి ఆరోప, ప్రత్యారోపణల్లో నిజం ఎంతుంది? ఢిల్లీ కాలుష్యానికి పంటల దుబ్బుకు సంబంధం ఏమిటీ? దుబ్బు తగుల బెట్టడం వల్ల ఎంత కాలుష్యం పెరుగుతుంది ? నివారణ చర్యలు ఏమిటీ?

ఢిల్లీ కాలుష్యం అక్టోబర్‌ 15 నుంచి నవంబర్‌ మొదటి వారంలో పెరగడానికి హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పంట దుబ్బులను తగులబెట్టడం కారణం అవుతున్న మాట వాస్తవమే. అక్టోబర్‌ నెలలో ఢిల్లీని ఆవహించే మొత్తం కాలుష్యంలో 24 శాతం కాలుష్యం పంట దుబ్బులను తగులబెట్టడం వల్లన అవుతుందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డుకు చెందిన నిపుణులు ఇదివరకే గుర్తించారు. అందుకు సంయుక్తంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా హర్యానా,  పంజాబ్, ఢిల్లీ ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. పంటల దుబ్బును తగులబెట్టకుండా ధ్వంసం చేసే యంత్రాల కొనుగోలు కోసం 1,150 కోట్ల రూపాయలను కూడా కేంద్రం కేటాయించింది.

ఒక్క అక్టోబర్‌ నెలలోనే కాకుండా డిసెంబర్, జనవరి నెలలో కూడా ఢిల్లీ కాలుష్యం ‘పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ 2.5’ 300లకు పైనే ఉంటుందిగదా! అని అమరిందర్‌ సింగ్‌ ప్రశ్నించడం కూడా సబబే. ఈ విషయంలో అరవింద్‌ కేజ్రివాల్‌ దష్టిని సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాహనాల, ఫ్యాక్టరీల కాలుష్యం నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలి. పంజాబ్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల పంట దుబ్బులను తగులబెట్టే సంఘటనలు గతేడిదితో పోలిస్తే 55 శాతం గణనీయంగా తగ్గాయి. గతేడాది 11,573 సంఘటనలు చోటుచేసుకోగా ఈ ఏడాది .4,338 సంఘటనలు మాత్రమే జరిగాయి.
 

ఎకరాకు ఆరు వేల ఖర్చు
పంజాబ్‌లో వరి పంట చేతికి రాగానే వారం పది రోజుల్లో గోధుమ పంట వేస్తారు. ఈ లోగా వరి దుబ్బును తగులబెట్టి గోధుమ పంటకు పొలాన్ని సిద్ధం చేస్తారు. వరి పంట చేతికి వచ్చి గోధుమ పంటను వేయడానికి మధ్య సమయం పట్టుమని పది రోజులు కూడా  లేకపోవడం, వరి దుబ్బును తగుబెట్టకుండా ధ్వంసం చేయడానికి ఎకరాకు దాదాపు ఐదు నుంచి ఆరు వేల రూపాయల వరకు ఖర్చు అవడం కారణంగా పంట దుబ్బులను తగులబెట్టక తప్పడం లేదని తరణ్‌ తరణ్‌ జిల్లాలో గురుసాబ్‌ సింగ్, హరి సింగ్‌ అనే రైతులు తెలియజేశారు. పంట దుబ్బులను తగులబెడితే అధికారులు రెండున్నర వేల రూపాయల జరిమానా విధిస్తున్నారని,  ఎకరాకు ఐదారు వేల రూపాయలను ఖర్చుపెట్టి దుబ్బును ధ్వంసం చేయడానికి బదులు తాము రెండున్నర వేల రూపాయల జరిమానా చెల్లించడానికే సిద్ధ పడుతున్నామని వారు చెప్పారు. పంటల దుబ్బులను తగుల బెట్టడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుందని తెలిసి తాము ఆధునిక సాగు యంత్రాలను ఉపయోగించే దుబ్బులను ధ్వంసం చేస్తున్నామని 200 ఎకరాల ఆసామి దిల్‌బాగ్‌ సింగ్‌ తెలిపారు. ఇందుకుగాను ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం పలుసార్లు సన్మానించింది. ఎక్కువ ఎకరాల భూమి ఉండడం వల్ల ఆయన కాలుష్య నివారణోపాయాలను పాటిస్తున్నారుగానీ తక్కువ ఎకరాల స్థలం కలిగిన రైతులకు అది కష్టం.

కారణాలు ఏమైనా కాలుష్యం నివారణకు హర్యానా, పంజాబ్, ఢిల్లీ ప్రభుత్వ ఓ రింగ్‌గా ఏర్పడి సంయుక్తంగా కషి చేయాల్సిందే. ఇందుకోసం పంజాబ్‌ ప్రభుత్వం అప్పుగా కోరుతున్న 30 వేల కోట్ల రూపాయల్తో సగమైనా కేంద్రం ఇవ్వాల్సిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top