మళ్లీ ఢిల్లీని కమ్మేసిన కాలుష్య మేఘం | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 5 2018 4:28 PM

Air Pollution, Thick Smog In Delhi  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ నగరాన్ని సోమవారం నాడు కాలుష్యం మేఘం మళ్లీ కమ్మేసింది. వాహనాల రాకపోకల రద్దీ, ఇరుగు, పొరుగు రాష్ట్రాల్లో పంట పొలాల దుబ్బును తగుల బెడుతుండడంతో నగర పరిసరాల్లో వాయు కాలుష్యం గత కొన్ని రోజులుగా తీవ్రంగా పెరిగింది. కాలుష్యం నియంత్రణ కోసం నవంబర్‌ ఒటక తేదీ నుంచి ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోగా, ఆదివారం నాటికి కాస్త తగ్గి సోమవారం నాడు మళ్లీ పెరిగింది. ఈ రోజు ఉదయం పూట వాయు కాలుష్యం మేఘంలా ఆకాశాన్ని ఆవహించడంతో వాహనాల రాకపోకలు కూడా స్తంభించిపోయాయి.



ఈ రోజు చాందినీ చౌక్‌ వద్ద ‘పీఎం 2.5 (గాలిలో 2.5 మైక్రో మీటర్ల కన్నా తక్కుక సైజు ధూళికణాలు)’491, పీఎం 10 (పది మైక్రో మీటర్ల కన్నా తక్కువైన) 444గా, ఆర్కే పురంలో పీఎం 2.5–426, పీఎం 10–351గా వాయు కాలుష్య సూచికపై నమోదయ్యాయి. ఢిల్లీ అంతటా ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు సరాసరిన కాలుష్యం 209గా నమోదయింది. కేంద్ర కాలుష్య నియంత్రణా బోర్డు ప్రకారం గాలిలో కాలుష్యం 0–50 వరకుంటే మంచిదిగాను, 51 నుంచి 100 వరకుంటే సంతప్తికరంగానూ, 101 నుంచి 200 వరకు ఫర్వాలేదని, 201 నుంచి 300 బాగా లేదని, 301 నుంచి 400 వరకు మరీ బాగా లేదని, 401 నుంచి 500 వరకు తీవ్రమైనదిగాను పరిగణిస్తారు.

ఢిల్లీ కాలుష్యంలో 24 శాతం హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పంటల  దుబ్బును తగులబెట్టడం వల్ల కలుగుతుందని నిపుణుల అంచనా వేశారు. ఢిల్లీ వాతావరణంలో నైట్రోజెన్‌ డయాక్సైడ్‌తోపాటు, బెంజిన్, కార్సినోజెన్‌ కాలుష్య కణాలు ఎక్కువగా ఉన్నాయి. వాహనాల పెట్రోలు, డీజిల్‌ కారణంగా వాతావరణంలోకి  నైట్రోజెన్‌ డయాక్సైడ్‌ వెలువడుతుంది. మిగతా కాలుష్య కణాలకు పంట దుబ్బలు తగులబెట్టడం, ఫ్యాక్టరీలు కారణం. కాలుష్యం నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా ఒక్క శుక్ర, శనివారాల్లోనే 80 లక్షల రూపాయల జరిమానాలను విధించారు. వాహనాల రాకపోకలను నియంత్రించారు. ఈ ప్రత్యేక చర్యలు ఈ నెల పదవ తేదీ వరకు కొనసాగుతాయి.

Advertisement
Advertisement