ఆ వీడియోలే కాపాడాయి

Videos of pilot shot by Pakistan mob helped Abhinandan Varthaman - Sakshi

లేదంటే అభినందన్‌ పరిస్థితి వేరేలా ఉండేది

ఆయన బతికి ఉన్నాడనేందుకు ఆధారాలు కూడా దొరక్కపోయేవి

1971 యుద్ధ సమయంలో పాక్‌ చెరనుంచి బయటపడ్డ భార్గవ విశ్లేషణ

వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ విషయంలో నక్కజిత్తుల మారి అయిన పాకిస్తాన్‌ అంత ఔదార్యంగా ఎందుకు వ్యవహరించిందన్న ప్రశ్నలు అందరి మనసులను తొలుస్తున్నాయి. అభినందన్‌ నడుపుతున్న మిగ్‌ విమానం కూలిపోయిన ప్రాంతంలో స్థానికులు ఆయనను తీవ్రంగా కొట్టడమే కాకుండా వీడియోలు తీసి, సోషల్‌ మీడియాలో పోస్టు చేయడమే ఆయన ప్రాణాలు కాపాడాయన్న విశ్లేషణలు వస్తున్నాయి. సోషల్‌ మీడియా విస్తృతి పెరగడమే అభినందన్‌ను రక్షించిందని 1971 పాకిస్తాన్‌ యుద్ధం సమయంలో పాక్‌ ఆర్మీకి చిక్కి దాదాపు ఏడాది పాటు బందీగా ఉన్న ఎయిర్‌ కమాండర్‌ జేఎల్‌ భార్గవ అభిప్రాయపడుతున్నారు. ‘అభినందన్‌పై ఆ అల్లరి మూక దాడి చేసి, వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టకపోతే ఏం జరిగేదో మనం ఊహించలేం.

అభినందన్‌ ప్రాణాలతో ఉన్నాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలుండేవి కావు. అభినందన్‌ తమ దగ్గరే లేడని పచ్చి అబద్ధాలు చెప్పే పాకిస్తాన్‌ బుకాయించి ఉండేది. ఇక మిగిలిన జీవితం అంతా ఆయన పాక్‌లోనే ఊచలు లెక్కించాల్సి వచ్చేది. అభినందన్‌ అదృష్టవంతుడు కాబట్టి ఆయన వీడియోలు విపరీతంగా ప్రాచుర్యం పొందాయి. దెబ్బకు పాక్‌ దారికి వచ్చి అభినందన్‌ను భారత్‌కు అప్పగించింది’అని 77 ఏళ్ల భార్గవ పేర్కొన్నారు. 1971 పాక్‌ యుద్ధం సమయంలో ఆ దేశానికి పట్టుబడ్డ 12 మంది భారత పైలట్లలో భార్గవ ఒకరు. హరియాణాలోని పంచ్‌కులలో ఆయన విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఒకప్పుడు తనకు ఎదురైన అనుభవాల్ని ఆయన పంచుకున్నారు.

అల్లరి మూకలతో ఎప్పుడూ ప్రమాదమే
పాకిస్తాన్‌లో పనీపాట లేకుండా భారత్‌పై ద్వేషభావంతో రగిలిపోయే అల్లరిమూకలతో ఎప్పుడూ ప్రమాదమే. అభినందన్‌ వారి బారిన పడినా ప్రాణాలతో బయటపడటానికి అక్కడి ఆర్మీయే కారణం. ఆర్మీ అప్పుడు రాకపోయింటే అభినందన్‌ పరిస్థితి ఊహించుకోవడానికే భయంగా ఉంది. 1965 యుద్ధం సమయంలో కూడా లెఫ్టినెంట్‌ హుస్సేన్‌ ఇలాగే పాక్‌లో అల్లరి మూకలకు చిక్కారు. వాళ్లు కొట్టిన దెబ్బలకి అతడు చనిపోయేవాడే. తన పేరు చెప్పడంతో ముస్లిం కాబట్టి కొట్టిన వారే ఆసుపత్రికి తీసుకువెళ్లి రక్తం ఇచ్చి బతికించారు.

పాక్‌ ఆర్మీ ప్రశ్నలతో చంపేస్తుంది
1971 డిసెంబర్‌ 5న పాక్‌తో యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతున్న సమయంలో బర్మార్‌ నుంచి పైలట్‌ భార్గవ హిందూస్తాన్‌ ఫైటర్‌ 24 విమానాన్ని నడుపుతుండగా పాక్‌ ఆర్మీ దాన్ని కూల్చేసి ఆయన్ను నిర్బంధించింది. ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి తీవ్రమైన ఒత్తిడికి లోను చేసింది. నిద్ర కూడా పోనివ్వకుండా అధికారులు వచ్చి అడిగిన ప్రశ్నలే మళ్లీ అడుగుతుంటారు. ఎంతటి శిక్షణ పొందిన సైనికుడికైనా ఆ ఒత్తిడి భరించడం కష్టం. ఒకసారి ఏం చెబితే మళ్లీ అదే చెప్పాలి. లేదంటే దొరికిపోతాం.

‘‘భారత వాయుసేన గురించి వాళ్లు నన్ను ఎన్నో ప్రశ్నలు వేశారు. తోటి పైలట్ల వివరాలు అడిగారు. మీ బ్యాచ్‌లో అత్యుత్తమ పైలట్‌ ఎవరు అని వారు అడిగితే, ‘అతను మీ ముందే కూర్చున్నాడు’అని బదులిచ్చాను’’అని భార్గవ చెప్పారు. ఇది జరిగిన ఏడాది తర్వాత కానీ భార్గవ పాక్‌కు బందీగా చిక్కారన్న విషయం ప్రపంచానికి తెలియలేదు. మొత్తానికి భారత్‌ ప్రయత్నాలు ఫలించి ఆయన క్షేమంగా వెనక్కి వచ్చారు. అప్పటి పంజాబ్‌ సీఎం జ్ఞానీ జైల్‌సింగ్‌ వాఘా సరిహద్దుల దగ్గర తనకు స్వాగతం పలికారని ఆ నాటి అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top