‘జీవన శైలి మార్చుకోవాలి’

Venkaiah Naidu Speech In IANCON 2019 At Hyderabad - Sakshi

లేదంటే పెనుముప్పు తప్పదు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్య

మాదాపూర్‌ : ఆహారపు అలవాట్లను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ న్యూరాలజీ ఆధ్వర్యంలో 27వ వార్షిక సదస్సు ఐయాన్‌కాన్‌–2019ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు మారిపోతున్న ఆహారపు అలవాట్లు, ఎప్పుడు కూర్చొని ఉండే మన జీవన శైలితో ప్రజలకు ప్రధానంగా భారత్‌ వాసులకు పెనుముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. గత రెండు దశాబ్దాలుగా సంభవించిన మరణాల్లో దాదాపు 55 శాతం కేవలం అంటువ్యాధులు, జీవన శైలి వ్యాధుల కారణంగా వచ్చినవే అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చని అన్నారు. దీనిపై భారత వాసులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఐయాన్‌కాన్‌ లాంటి సదస్సులు పలు జబ్బులపై ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని పెంచుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో న్యూరాలజీతో పాటు ఎన్నో రంగాలకు చెందిన వైద్య నిపుణులు పాలు పంచుకునేలా కృషి చేస్తున్న నిర్వాహక కమిటీ సేవలను ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ న్యూరాలజీ అధ్యక్షుడు డాక్టర్‌ సతీష్‌ ఖాదీల్కర్‌ కొనియాడారు.  

18 దేశాల న్యూరో ఫిజీషియన్లు.. 
ఈ సదస్సులో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల నుంచి అనేక మంది న్యూరో ఫిజీషియన్లు ఇతర రంగాలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు. ఈ సదస్సును బ్రెయిన్‌ అండ్‌ స్పైన్‌ సొసైటీ ఆ«ఫ్‌ ఇండియాతో కలిసి ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ న్యూరాలజీ సంయుక్తంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ న్యూరాలజీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ వీలియం కరోల్, కిమ్స్‌ హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బొలినేని భాస్కర్‌రావు, ఐయాన్‌కాన్‌–2019 నిర్వాహక కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ మోహన్‌దాస్, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ సీతాజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top