తండ్రి కంటే కొడుకే బెటర్! | uttar pradesh people choose akhilesh yadav than mulayam singh | Sakshi
Sakshi News home page

తండ్రి కంటే కొడుకే బెటర్!

Sep 27 2016 10:20 AM | Updated on Jul 30 2018 8:10 PM

తండ్రి కంటే కొడుకే బెటర్! - Sakshi

తండ్రి కంటే కొడుకే బెటర్!

ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీలో ఇటీవలి వివాదం తర్వాత నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి.

ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీలో ఇటీవలి వివాదం తర్వాత నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరుంటే బాగుంటుందన్న ప్రశ్నకు.. ఎక్కువ మంది అఖిలేష్ యాదవ్ పేరే చెప్పారట. ఆయన తర్వాత ఎక్కడో దూరంగా ములాయం సింగ్ యాదవ్ ఉండగా.. తాజాగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన శివపాల్ యాదవ్ పరిస్థితి బాగా ఘోరంగా ఉందట. రాష్ట్రంలోని 403 అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం 11వేల మంది ప్రజలతో చేసిన సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి.

సీఓటర్ సంస్థ ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలని అడిగితే.. మొత్తం 70.3 శాతం మంది అఖిలేష్ యాదవ్ వైపే మొగ్గు చూపించారు. కేవలం 26.1 శాతం మంది మాత్రమే ములాయం తమ ఛాయిస్ అని చెప్పారు. ముస్లింలలో కూడా 75.6 శాతం మంది అఖిలేష్ అయితే బాగుంటుందని చెప్పగా, ములాయం సింగ్ యాదవ్ వైపు 19.4 శాతం మంది మొగ్గుచూపించారు. ఇతర కులాలు, వర్గాలలో కూడా ములాయం కంటే అఖిలేష్ ఎక్కువ మెజారిటీతోనే ఉన్నారు.

ఇక ఇటీవలే అఖిలేష్ యాదవ్‌తో గొడవపడి.. తన పాత పదవులతో పాటు కొత్తగా రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా చేజిక్కించుకున్న శివపాల్ యాదవ్‌కు మాత్రం కేవలం 6.9 శాతం మంది మద్దతు తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ మద్దతుదారుల్లో కూడా 88.1 శాతం మంది పార్టీ పగ్గాలను అఖిలేష్ చేపట్టాలని కోరుకున్నారు. కానీ 38.2 శాతం మంది మాత్రం క్రిమినల్ ఇమేజి నుంచి పార్టీని బయటకు తీసుకొచ్చి దాన్ని సమర్థంగా నడిపించలేకపోతున్నారన్నారు. కుటుంబంలో చెలరేగిన ఈ వివాదం అంతా కేవలం అఖిలేష్‌కు ఓటర్ల సానుభూతి తెచ్చిపెట్టడానికేనని 24.2 శాతం మంది అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement