ఆధార్‌ ధ్రువీకరణకు ఇక ఫేస్‌ రికగ్నిషన్‌

UIDAI allows facial recognition for Aadhaar authentication  - Sakshi

న్యూఢిల్లీ: బయోమెట్రిక్‌ పద్ధతి వల్ల ఆధార్‌ ధ్రువీకరణ సమయంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారి కోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) మరో కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. ఇప్పటిదాకా కేవలం వేలి ముద్రలు, ఐరిస్‌ ద్వారానే ఆధార్‌ ధ్రువీకరణకు అవకాశం ఉండగా, ఇకపై ముఖాకృతిని గుర్తించటం (ఫేస్‌ రికగ్నిషన్‌) ద్వారా కూడా ధ్రువీకరణ చేసుకునే వెసులుబాటును కల్పించనుంది. ఏవేనీ కారణాల వల్ల వేలిముద్రలు చెరిగిపోయిన లేదా బాగా దెబ్బతిన్న వారికి, వృద్ధాప్యంలో ఉండి వేలిముద్ర వేయలేని వారికి యూఐడీఏఐ తాజా నిర్ణయం ఎంతో ఉపయోగకరం.

అయితే ఫేస్‌ రికగ్నిషన్‌ విధానంలో ధ్రువీకరణ చేసుకోవాలంటే ముఖానికి తోడు వేలిముద్ర లేదా కళ్లు (ఐరిస్‌) లేదా ఆధార్‌ డేటా బేస్‌లో రిజిస్టర్‌ అయి ఉన్న మొబైల్‌కి వచ్చే ఓటీపీ (వన్‌ టైం పాస్‌వర్డ్‌)....వీటిలో ఏదో ఒకటి కూడా కచ్చితంగా అవసరం. ఈ విధానాన్ని జూలై 1 నుంచి అవసరమైన చోట ఉపయోగించుకోవచ్చని యూఐడీఏఐ సోమవారం వెల్లడించింది. ఫేస్‌ రికగ్నిషన్‌ కోసం కొత్తగా రిజిస్ట్రేషన్‌ అవసరం లేదనీ, ఇంతకు ముందే ఆధార్‌ డేటాబేస్‌లో ఉన్న ఫొటోనే ఇందుకోసం వాడతారని తెలిపింది.

ఫేస్‌ రికగ్నిషన్‌కు అవకాశం కల్పించేలా ధ్రువీకరణ యంత్రాల్లో కూడా మార్పులు చేసేందుకు యూఐడీఏఐ ఆయా యంత్రాల ఉత్పత్తిదారులతో కలిసి పనిచేయనుంది. ప్రస్తుతం దేశంలో 119 కోట్ల మందికి ఆధార్‌ కార్డులుండగా, సగటున రోజుకు 4 కోట్ల ఆధార్‌ ధ్రువీకరణలు జరుగుతున్నాయి. ఆధార్‌ సమాచారానికి మరింత భద్రత, గోప్యత కోసం 16 అంకెల వర్చువల్‌ గుర్తింపు సంఖ్యను కేటాయించే విధానాన్ని కూడా మార్చి 1 నుంచి అమలు చేస్తామని యూఐడీఏఐ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top