బిహార్‌లో మరో రెండు పరువు హత్యలు చోటు చేసుకున్నాయి.
గయ: బిహార్‌లో మరో రెండు పరువు హత్యలు చోటు చేసుకున్నాయి. ఓ మైనర్ బాలిక, పెళ్లయిన యువకుడి ప్రేమ వ్యవహారంపై ఆగ్రహించిన పెద్దలు వారిద్దరినీ కొట్టిచంపారు. తర్వాత మృతదేహాలను దహనం చేశారు. గయ జిల్లాలోని అమేథ గ్రామంలో బుధవారం ఈ సంఘటన జరిగింది. గయ సీనియర్ ఎస్పీ మనూ మహరాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమేథకు చెందిన పార్వతి దేవి(15), జైరాం మాంఝీ(25) అనే దళిత యువకుడు పరస్పరం ప్రేమించుకున్నారు.
మాంఝీకి అదివరకే పెళ్లి అయింది. ఈ వ్యవహారంపై ఇరువర్గాల మధ్య వివాదం రేగడంతో బుధవారం గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. రాజీకి బాలిక తరఫు వారు అంగీకరించలేదు. బాలిక కుటుంబ సభ్యులతో పాటు మరో 15 మంది గ్రామస్తులు కలిసి ప్రేమికులిద్దరినీ కొట్టి చంపారు. తర్వాత వారిని ఊరి బయటికి తీసుకెళ్లి దహనం చేశారు.