నా గుర్తింపు ఏదీ ..? | Transgenders Facing Problem In Aadhar Card Link With Pan card | Sakshi
Sakshi News home page

నా గుర్తింపు ఏదీ ..?

Mar 1 2018 8:43 PM | Updated on Apr 3 2019 9:21 PM

Transgenders Facing Problem In Aadhar Card Link With Pan card - Sakshi

(ఫైల్ ఫోటో)

దేశంలోని ట్రాన్స్‌జెండర్లు గుర్తింపు సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నారు. ఇప్పటికే వివిధ రూపాల్లో వివక్ష, వేధింపులకు గురవుతున్న వారికి పర్మినెంట్‌ అకౌంట్‌ నెంబర్‌ (పాన్‌) రూపంలో కొత్త సమస్య ఎదురైంది. ఆదాయపు పన్ను మదింపుతో సహా సంక్షేమ పథకాల లబ్దికి, బ్యాంకు రుణాలు, ఇతర ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం ఆధార్‌–పాన్‌ అనుసంధానం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరుతో  ఈ గడువు ముగుస్తుండడంతో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. పురుషులు, మహిళల మాదిరిగానే  ట్రాన్స్‌జెండర్ల పేరిట కూడా ఆధార్‌కార్టులు జారీచేస్తున్నారు. వచ్చిన చిక్కల్లా పాన్‌ కార్డుల్లో ఆ వెసులుబాలు లేకపోవడమే.  ఆధార్‌కార్డుల్లో ట్రాన్స్‌జెండర్లుగా, పాన్‌కార్డుల్లో మాత్రం వారి గుర్తింపు పురుషుడు లేదా మహిళగా పేర్కొనడంతో ఆధార్‌–పాన్‌ లింకింగ్‌ కుదరడం లేదు.  పుట్టిన సందర్భంగా మగ లేదా ఆడపిల్లగా పొందిన గుర్తింపు ఆధారంగా పాన్‌కార్డులిస్తుండడం, ట్రాన్స్‌జెండర్లను విడిగా గుర్తించకపోవడమే ఈ సమస్యకు కారణం.  దీనితో వారు ఐటీ రిటర్న్స్‌ కూడా దాఖలు చేయలేకపోతున్నారు. దీని ప్రభావం ఇప్పుడు  దాదాపు 5 లక్షల మంది  (ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కలిపి దాదాపు 70 వేలు) మేర ఉన్న మొత్తం ట్రాన్స్‌జెండర్ల సమాజంపై పడనుంది.

‘సుప్రీం’ తీర్పు ఏం చెబుతోంది ?
 ట్రాన్స్‌జెండర్లకు సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (నల్సా) తీర్పు రూపంలో  సుప్రీంకోర్టు  నాలుగేళ్ల క్రితం ఆదేశాలిచ్చింది. సంక్షేమ పథకాల లబ్దితో మొదలుపెట్టి వీరికి అన్ని రకాల సహాయ,సహకారాలను అందించాలని సూచించింది. తమ గుర్తింపును తామే నిర్థారించుకునే ప్రాథమిక హక్కును వారికి కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్‌జెండర్ల సంక్షేమబోర్డులు ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలోనే  పశ్చిమబెంగాల్‌లోని ఓ ప్రభుత్వ ఎయిడెడ్‌ కాలేజీ ట్రాన్స్‌జెండర్‌కు ప్రిన్సిపాల్‌గా అవకాశమిచ్చింది. కొచ్చి మెట్రో సంస్థ  పలు విభాగాల్లో వీరి సర్వీసులు ఉపయోగించుకుంటోంది.

ఎదురయ్యే సమస్యలివీ !
ఆధార్‌–పాన్‌ లింకింగ్‌ తప్పనిసరి అయిన నేపథ్యంలో ట్రాన్స్‌జండర్లకు ఎదురయ్యే సమస్యలు...ఆదాయ పన్ను రిటర్న్‌లు దాఖలు చేయలేకపోవడం, రూ. 50 వేలకు పైబడిన ఆస్తుల కొనుగోలు/విక్రయానికి పాన్‌ నెంబర్‌ తప్పనిసరి కావడంతో చిక్కులు. సొంతంగా ఏదైనా వ్యాపారాన్ని రిజిష్టర్‌ చేసుకోవాలంటే పాన్, ఆధార్‌కార్డుల ఆవశ్యకత. 2017 మనీలాండరింగ్‌ నియంత్రణ చట్టప్రకారం మ్యూచువల్‌ ఫండ్‌ ఖాతాలను అప్‌డేట్‌ చేయకపోవడం, బ్యాంక్‌ ఖాతాలు తెరిచేందుకు ఇబ్బందులు ఎదురవడం వంటి సమస్యలున్నాయి.

నన్ను నాలాగే  గుర్తించండి...
‘ట్రాన్స్‌జెండర్‌గా నన్ను నేను అంగీకరించాను. దీనినే ప్రతి గుర్తింపు కార్డు చాటిచెప్పాలని కోరుకుంటున్నాను. కారు యజమానిగా పత్రాల్లో గుర్తింపుతో పాటు, మెడికల్‌ ఇన్సురెన్స్, ఆస్తి పత్రాలు, పాన్‌కార్డు వరకు అన్నింట్లోనే ఇదే స్పష్టంగా పేర్కొనాలి’ అని రేష్మా ప్రసాద్‌ అంటున్నారు.

–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement