టెంక లేని మామిడి పండును ఊహించుకోండి! ఎలాంటి ఇబ్బంది లేకుండా దాని రుచిని పూర్తి స్థాయిలో ఆస్వాదించవచ్చు కదూ!! త్వరలోనే ఈ కొత్త రకం మామిడి అందుబాటులోకి రానుంది.
పాట్నా: టెంక లేని మామిడి పండును ఊహించుకోండి! ఎలాంటి ఇబ్బంది లేకుండా దాని రుచిని పూర్తి స్థాయిలో ఆస్వాదించవచ్చు కదూ!! త్వరలోనే ఈ కొత్త రకం మామిడి అందుబాటులోకి రానుంది. అది కూడా మరింత తీయగా, సరికొత్త రుచితో ఆకట్టుకోనుంది. భాగల్పూర్ జిల్లాలోని బీహార్ అగ్రికల్చర్ యూనివర్సిటీ(బీఏయూ) పరిశోధకులు ఈ కొత్త రకాన్ని అభివృద్ధి పరిచారు. ఈ వెరైటీ పేరు సింధు. రత్నా, ఆల్ఫోన్సో హైబ్రిడ్ రకాల నుంచి దీన్ని సృష్టించారు. దీనిపై దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఒకేసారి పరిశోధనలు జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సగటున 200 గ్రాముల బరువుండే ఈ రకం మామిడిలో.. ఇతర వెరైటీల్లో కన్నా తక్కువ ఫైబర్ ఉంటుందట! సింధు రకాన్ని ఇంటి పెరట్లో పెంచుకోవచ్చు లేదా తోటలు వేసి పెద్ద ఎత్తున కూడా ఉత్పత్తి చేయవచ్చని తమ పరిశోధనల్లో నిర్ధారించామని బీఏయూ ఉద్యానవన విభాగం చైర్మన్ వి.బి. పటేల్ తెలిపారు. దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. నిజానికి సింధు రకాన్ని మహారాష్ర్టలోని కొంకణ్ ప్రాంతంలో ఉన్న కొంకణ్ కృషి విద్యాపీఠ్ ప్రాంతీయ పండ్ల పరిశోధనా కేంద్రంలో తొలుత అభివృద్ధి పరిచినట్లు పటేల్ వివరించారు. అక్కడి మూడేళ్ల వయసున్న సింధు రకం మామిడి చెట్టు ఈసారి విరగ కాసిందని పేర్కొన్నారు. వచ్చే సీజన్‌లోనే ఈ వెరైటీని బీహార్‌లోని మామిడి రైతులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్లు తెలిపారు.