మన దేశాన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి యత్నిస్తున్న పాకిస్థాన్.. ఉగ్రవాదానికి వీలైనంత సాయం చేస్తోంది. ఆ దేశంతో పాటు, దాని ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ భాగంలో(పీవోకే)లో 42 ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నడుస్తున్నాయి.
న్యూఢిల్లీ: మన దేశాన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి యత్నిస్తున్న పాకిస్థాన్.. ఉగ్రవాదానికి వీలైనంత సాయం చేస్తోంది. ఆ దేశంతో పాటు, దాని ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ భాగంలో(పీవోకే)లో 42 ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నడుస్తున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి గత మూడేళ్లలో 270 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడ్డారు. హోంశాఖ సహాయ మంత్రి ఆర్పీఎన్ సింగ్ లోక్‌సభలో ఈ వివరాలను వెల్లడించారు. 2010-12 మధ్య వెయ్యి సార్లు చొరబాట్లకు ఉగ్రవాదులు ప్రయత్నించారని, వారిలో 160 మందిని భారత దళాలు కాల్చి చంపాయని తెలిపారు.
దేశంలో ఉన్న వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, విదేశాల నిఘా సంస్థల ద్వారా ఇక్కడి ఉగ్రవాదులకు హవాలా మార్గంలో నిధులు అందుతున్నాయన్నారు. దీని కోసం నకిలీ నోట్లను మార్గంగా ఎంచుకున్నారని వెల్లడించారు. కాగా, నకిలీ భారత కరెన్సీ నోట్లను పాక్‌లో ముద్రించి చైనా, నేపాల్ తదితర దేశాల ద్వారా భారత్‌లోకి తరలిస్తున్నారని ఆర్థిక శాఖ సహాయ మంత్రి నమోనారాయణ్ మీనా రాజ్యసభలో వెల్లడించారు. గత జూన్ 30న ఒకేరోజు రూ. పదికోట్లకు పైగా విలువైన రెండు లక్షల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.