టిక్‌టాక్‌ యాప్‌పై నిషేధం..?! | Sakshi
Sakshi News home page

టిక్‌టాక్‌ యాప్‌పై నిషేధం..?!'

Published Wed, Feb 13 2019 1:35 PM

Tamil Nadu Will Try to Ban TikTok App - Sakshi

చెన్నై : దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకున్న చైనా బేస్డ్‌ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం సంచలనం నిర్ణయం తీసుకుంది. ఈ యాప్‌ బ్లూవేల్‌ గేమ్‌ కన్నా ప్రమాదకరమైనదిగా తమిళనాడు రాజకీయనాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ మంత్రి ఎం మనికందన్‌ టిక్‌టాక్‌ యాప్‌ వల్ల తలెత్తుతున్న దుష్పరిణామాల గురించి అసెంబ్లీలో చర్చించాడు. ఈ యాప్‌ వాడకం వల్ల తమిళ సంస్కృతే కాక శాంతిభద్రతలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని మణికందన్‌ అభిప్రాయపడ్డారు.

అసభ్యకర నృత్యాలకు, ఫోర్నోగ్రఫికి టిక్‌టాక్‌ వేదికగా నిలిచిందని.. ఫలితంగా యువత తప్పుదోవ పడుతున్నారని మణికందన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ యాప్‌ను బ్యాన్‌ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామన్నారు. అనతి కాలంలోనే టిక్‌టాక్‌ యాప్‌ దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకుంది. డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్ అన్ని ఉన్న ఈ యాప్ యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. దాంతో యువత తమలో ఉన్న యాక్టింగ్ టాలెంట్‌తో వీడియోలు చేసి పోస్ట్‌ చేస్తున్నారు.

ఇదే క్రమంలో టిక్‌టాక్ యాప్ చాలా సందర్భాల్లో దుర్వినియోగం కూడా అవుతోంది. ఇటీవల కాలంలో తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా కలెక్టర్ రోహిణి పర్సనల్ ఫోటోలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సినిమా పాటలతో యాడ్ చేసి టిక్‌టాక్ యాప్‌లో పోస్టు చేశారు. ఆమెతోపాటు ఆమె కుమారుడి ఫోటోలను కూడా వివిధ రకాల సోషల్ మీడియా నెట్ వర్క్ లలో షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న రోహిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సైబర్‌క్రైం పోలీసులు ఈ ఫోటోలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.

గత ఏడాది జనవరిలో కూడా ఇలాంటే సంఘటనే చోటు చేసుకుంది. నలుగురు యువకులు పోలీసులను అవమానిస్తూ ఓ ఫన్‌ వీడియోను రూపొందించి ఇబ్బందులకు గురయ్యారు.  ప్రతి చోట ఇలాంటి తలనొప్పులు ఎదురవుతున్నప్పటికీ ఈ యాప్ విషయంలో ఏ రాష్ట్రం కూడా తమిళనాడు తరహా నిర్ణయం తీసుకోలేదు.

Advertisement
Advertisement