గుర్గావ్‌ బాలుడి హత్య కేసు: కేంద్రానికి నోటీసులు | Sakshi
Sakshi News home page

గుర్గావ్‌ బాలుడి హత్య కేసు: కేంద్రానికి నోటీసులు

Published Mon, Sep 11 2017 2:06 PM

Student death case: SC issued notice to Centre, HRD Ministry & Haryana Government

న్యూఢిల్లీ: గుర్గావ్‌ ర్యాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రెండో తరగతి విద్యార్థి దారుణ హత్య ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయ్యింది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో పాటు హెచ్‌ఆర్డీ, హరియాణా ప్రభుత్వానికి న్యాయస్థానం సోమవారం నోటీసులు ఇచ్చింది. మూడు వారాల్లోకి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

కాగా హత్యకు గురైన విద్యార్థి ప్రద్యుమన్‌ ఠాకూర్‌ తండ్రి వరుణ్‌ ఠాకూర్‌ ... ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఇటువంటి కేసుల విచారణకు ట్రిబ్యునల్‌ లేదా ఓ అధార్టీని ఏర్పాటు చేయాలన్నారు. మరోవైపు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌.. ఇవాళ వరుణ్‌ ఠాకూర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సీబీఐ విచారణకు ఆదేశిస్తామని సీఎం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.


శుక్రవారం ఉదయం రెండేళ్ల విద్యార్థి ప్రద్యుమన్‌పై స్కూల్‌ బస్సు డ్రైవర్‌ లైంగిక దాడికి యత్నించాడు. అయితే ప్రతిఘటించిన అతడిని డ్రైవర్‌ దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. బాలుడిపై లైంగిక దాడికి తాను ప్రయత్నించానని, దీనిని బాలుడు ప్రతిఘటించడంతో చంపేశానని తెలిపాడు. 42 ఏళ్ల అశోక్‌ కుమార్‌ గుర్గావ్‌లోని ర్యాన్ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో ఎనిమిది నెలలుగా బస్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

స్కూల్‌ టాయలెట్‌లో బాధిత బాలుడు ఒంటరిగా కనిపించాడని, దీంతో అతనిపై లైంగిక దాడిచేసేందుకు ప్రయత్నించగా.. బాలుడు తప్పించుకునేందుకు యత్నించాడని, దీంతో అతన్ని టాయ్‌లెట్‌లోకి లాక్కెళ్లి గొంతు కోసేశానని, కత్తితో బాలుడిని రెండుసార్లు పొడిచానని అతడు తెలిపాడు. అంతేకాకుండా కత్తిని కడిగి అదే ప్రదేశంలో పారేశానని చెప్పాడు. సంఘటన స్థలంలో లభించిన ఆధారాలతో నిందితుడిని పోలీసులు వెంటనే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక విద్యార్థి మృతికి బాధ్యునిగా చేస్తూ పాఠశాల తాత్కాలిక ప్రిన్సిపల్‌ను సస్పెండ్‌ చేయడంతో పాటు మొత్తం భద్రతా సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. 

Advertisement
Advertisement