రెమిడిసివిర్‌కు తీవ్ర కొరత

Shortage Of The Antiviral Drug Remdesivir Across India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ చికిత్సలో కీలక ఔషధంగా భావిస్తున్న యాంటీవైరల్‌ డ్రగ్‌ రెమిడిసివిర్‌ అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ ఔషధం లభ్యత అరకొరగా ఉన్నా కరోనా హాట్‌స్పాట్‌గా మారిన ఢిల్లీలో పరిస్థితి తీవ్రంగా ఉంది. రెమిడిసివిర్‌ కొరత కారణంగా ఇతర నగరాల నుంచి రోగులు అధిక మొత్తం వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. రెమిడిసివిర్‌ మందుకు డిమాండ్‌ అధికంగా ఉండటం, పరిమిత సరఫరాలతో కొరత ఏర్పడిందని డాక్టర్లు చెబుతున్నారు. మధ్యస్థ లక్షణాలతో బాధపడే కోవిడ్‌-19 రోగులకు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఔషధాన్ని వాడేందుకు జూన్‌ 13న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండంతో డాక్టర్లు రెమిడిసివిర్‌ను సిఫార్సు చేస్తున్నారు. అయితే సరఫరాలు మాత్రం ఆ స్ధాయిలో పెరగకపోవడంతో ఈ ఔషధానికి కొరత ఏర్పడింది.

ఈ ఔషధాన్ని రోగులు ఇంజెక్షన్‌ రూపంలో ఆరు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఔషదం పేటెంట్‌ కలిగిన గిలియడ్‌ సైన్సెస్‌కు జూన్‌ 1న భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) రెమిడిసివిర్‌ దిగుమతులకు అనుమతించింది. భారత్‌లో ఈ ఔషధ తయారీకి హెటెరో, సిప్లా, మైలాన్‌లకు  లైసెన్స్‌ ఉండగా జుబిలియంట్‌, జైదూస్‌ సహా మరికొన్ని సంస్ధలు డీజీసీఐ అనుమతుల కోసం వేచిచూస్తున్నాయి.రెమిడిసివిర్‌ పేటెంట్‌ కలిగిన గిలియాడ్‌ సైన్సెస్‌తోనీ సంస్ధలన్నీ భారత్‌లో రెమిడిసివిర్‌ తయారీ కోసం ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రస్తుతం హెటెరో సంస్థ ఢిల్లీలో రెమిడిసివిర్‌ను వయల్‌కు రూ 5400 చొప్పున సరఫరా చేస్తోంది.

మరో రెండు కంపెనీల నుంచి సరఫరాలు మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుండటంతో రెమిడిసివిర్‌ కొరతను అధిగమించవచ్చని ఢిల్లీ ఔషధ నియంత్రణ విభాగానికి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. కాగా, ఈ వారాంతంలో రెమిడివిర్‌ డ్రగ్‌ను సిప్లా మార్కెట్‌లోకి తీసుకురావచ్చని భావిస్తున్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఈ డ్రగ్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాయి. మరికొన్ని రాష్ట్రాలు హెటెరో ఫార్మకు రెమిడిసివిర్‌ కోసం ఆర్డర్లు ఇచ్చాయి. మరోవైపు కీలక ఔషధాల బ్లాక్‌ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేసేలా చర్యలు చేపట్టాలని డీసీజీఐ ఆయా రాష్ట్రాల ఔషధ నియంత్రణ అధికారులకు లేఖలు రాసింది. ఢిల్లీకి చెందిన అభయ్‌ శ్రీవాస్తవ్‌ కోవిడ్‌-19తో బాధపడే తన మిత్రుడి తల్లి (84)కి అవసరమైన రెమిడిసివిర్‌ కోసం పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆస్పత్రిలో ఈ మందు లభించకపోవడంతో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి రెమిడిసివిర్‌ను బాధిత కుటుంబం సమకూర్చిందని శ్రీవాస్తవ్‌ చెప్పుకొచ్చారు.

ఫార్మసీల్లోనూ ఈ డ్రగ్‌ దొరకడం లేదని దీనికోసం తాము ఎక్కడికి వెళ్లాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసిన అనంతరం రూ 65,000కు ఈ మెడిసిన్‌ను అందిస్తామని ఎవరో హామీ ఇచ్చారని చెప్పారు. ముంబైలో తన సోదరుడు రెమిడిసివిర్‌ను కొనుగోలు చేసి తమకు కొరియర్‌ ద్వారా పంపించాడని తెలిపారు. మరోవైపు ఈ ఔషధం దొరక్క ఇబ్బందులు పడినవారి జాబితాలో జర్నలిస్టులూ ఉన్నారు. జర్నలిస్ట్‌ సమర్థ్‌ బన్సల్‌ తన నాయనమ్మ కోసం ఈ ఔషధం కోసం ప్రయత్నించగా ఒక్కో వయల్‌కు రూ 30,000 వరకూ కొటేషన్లు వచ్చాయని వాపోయారు. ఆస్పత్రి ఫార్మసీలో ఈ మందు అందుబాటులో లేకపోవడంతో ఇతరత్రా విచారించగా ఢిల్లీ హోల్‌సేల్‌ మార్కెట్‌ నుంచి అత్యధిక ధరను కోట్‌ చేశారని చెప్పుకొచ్చారు. చివరికి కోల్‌కతా నుంచి రెమిడిసివిర్‌ను తెప్పించుకున్నామని చెప్పారు.

చదవండి : కరోనాకు కొత్త చికిత్స

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top