‘ప్రజాకర్షక’ మార్గం పట్టలేదు | rule aimed at long-term benefits | Sakshi
Sakshi News home page

‘ప్రజాకర్షక’ మార్గం పట్టలేదు

May 29 2015 1:56 AM | Updated on Aug 24 2018 2:17 PM

‘ప్రజాకర్షక’ మార్గం పట్టలేదు - Sakshi

‘ప్రజాకర్షక’ మార్గం పట్టలేదు

ప్రజాకర్షక పథకాల మార్గంలో కాకుండా.. కొంచెం కష్టమైనప్పటికీ ప్రభుత్వ యంత్రాంగంలోని లోపాలను సరిచేసి ప్రజలకు ....

దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా పాలన సాగించాం
కేంద్రం, రాష్ట్రాల టీమ్ వర్క్‌తోనే దేశాభివృద్ధి {పధాని మోదీ ఉద్ఘాటన

 
న్యూఢిల్లీ: ప్రజాకర్షక పథకాల మార్గంలో కాకుండా.. కొంచెం కష్టమైనప్పటికీ ప్రభుత్వ యంత్రాంగంలోని లోపాలను సరిచేసి ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలను చేకూర్చే పాలనావిధానాన్ని అవలంబించానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వివరించారు. ‘పాలనాపగ్గాలు చేపట్టినప్పుడు నా ముందు రెండు మార్గాలున్నాయి. ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ యంత్రాంగంలో ఉత్తేజం నింపి, వ్యవస్థలో చాన్నాళ్లుగా వేళ్లూనుకుపోయిన లోపాలను సరిచేసి, ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరేలా స్వచ్ఛమైన, నిజాయితీతో కూడిన, సమర్థ పాలన అందించడం ఒక మార్గం కాగా.. కొత్తకొత్త ప్రజాకర్షక పథకాలను ప్రకటిస్తూ, మీడియాలో హంగామా చేస్తూ, ప్రజలను మోసం చేస్తూ పాలన కొనసాగించడం మరో మార్గం. రెండోది ప్రజలు అలవాటు పడిన విధానం. సులభమైన మార్గం. ఆ మార్గంలో నేను వెళ్లాలనుకోలేదు. కొంచెం కష్టమైనప్పటికీ మొదటి మార్గాన్నే ఎన్నుకున్నాను. ప్రజాకర్షక పథకాల మార్గాన్ని ఎన్నుకుని ఉన్నట్లయితే, ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేసినవాడినయ్యేవాడిని’ అంటూ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సవివర సమాధానమిచ్చారు.

అధికారుల్లో విశ్వాసం నెలకొల్పడం తాను సాధించిన విజయమన్నారు. ‘చిన్న విషయంగా కనిపించవచ్చు కానీ.. నేను క్రమం తప్పకుండా అధికారులతో సమావేశమవుతుంటాను. అది నా పని విధానం. దాని వల్ల గొప్ప ఫలితం సాధించాను’ అన్నారు. ఇకపై పరిశుభ్ర నగరాలు, నిరంతరాయంగా విద్యుత్‌ను, తాగునీటిని సరఫరా చేయడం, ఇళ్లు లేని పేదలకు 5 కోట్ల ఇళ్ల నిర్మాణం, అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి.. తదితరాలపై దృష్టి పెట్టనున్నామన్నారు. భారతీయ యువతలో సామర్థ్య, నైపుణ్య పెంపునకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆ దిశగానే అటల్ ఇన్నోవేషన్ మిషన్, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ టాలెంట్ యుటిలైజేషన్(సేతు) పథకాలను ప్రారంభించామన్నారు.
 
యుద్ధ సన్నద్ధతపై..

 మన సాయుధ దళాల యుద్ధ సన్నద్ధత సరిగా లేదని, ఒకవేళ యుద్ధం వస్తే మన దగ్గర కేవలం 20 రోజులకు సరిపడే మందుగుండు మాత్రమే ఉందని ఇటీవల కాగ్ పేర్కొన్న విషయంపై స్పందిస్తూ.. ‘ఇలాంటి సున్నితమైన అంశాలపై బహిరంగంగా వ్యాఖ్యానించడం సరికాదు. మన ఆర్మీ, నేవీ, వైమానిక దళం, తీర దళం చేతుల్లో మన దేశం సురక్షితంగా ఉందన్న హామీ దేశప్రజలకు ఇస్తున్నా’ అన్నారు. కేంద్రం, రాష్ట్రాలు కలసి పనిచేస్తేనే దేశాభివృద్ధి సాధ్యమని మోదీ పేర్కొన్నారు. ‘ప్రధాని, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక టీం.. కేంద్రమంత్రులు, రాష్ట్రాల మంత్రులు మరో టీం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు ఇంకొక బృందం. ఇలా కలసి పనిచేస్తేనే అభివృద్ధి సాధించగలం’ అని వివరించారు. ‘రాష్ట్రాలు, కేంద్రం మధ్య అపనమ్మకం అనేది దశాబ్దాలుగా ఒక సంప్రదాయంగా వస్తోంది. మేం అధికారంలోకి వచ్చాక దాన్ని మార్చేందుకు ప్రయత్నించాం. అందులో భాగంగానే నీతి  ఆయోగ్‌లో రాష్ట్రాలకు కీలక భాగస్వామ్యం కల్పించాం’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement