రిసార్టు రాజకీయాలకు కేరాఫ్‌ కర్ణాటక

Resort Politics Takes Centre Stage In Karnataka Once Again - Sakshi

సంక్షోభ సమయాల్లో విలాసాల విడిది  

ఏ రాష్ట్రం ఎమ్మెల్యేలైనా కన్నడనాడుకే  

తాజాగా మధ్యప్రదేశ్‌ శాసనసభ్యుల మకాం

సాక్షి, బెంగళూరు: రాజకీయ సంక్షోభమా, ప్రభుత్వాన్ని కూల్చెలా.. అయితే ఎమ్మెల్యేలతో కర్ణాటకలో మకాం వేసేద్దాం అంటున్నాయి పార్టీలు. రిసార్టు రాజకీయాలకు కర్ణాటక రాష్ట్రం కేరాఫ్‌ అడ్రెస్‌గా మారింది. ప్రస్తుతం మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మద్దతుదారులైన మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ రెబెల్‌ ఎమ్మెల్యేలు గత వారంరోజుల నుంచి బెంగళూరు రిసార్టులో మకాం వేశారు. ఇలా ప్రభుత్వాలను కూల్చేందుకు రాజకీయ నాయకులు కర్ణాటకలో ఆశ్రయం పొందడం ఇదేమీ తొలిసారి కాదు. దశాబ్దాలుగా రిసార్టు రాజకీయాలకు రాష్ట్రం పేరుగాంచింది. చదవండి: బలపరీక్షపై వైఖరేంటి?


రిసార్టు రాజకీయాలకు నెలవుగా మారిన కన్నడ రాజధాని

ఎంత ఖర్చయినా సరే : ఎన్నికల సమయంలో, అసమ్మతి రాజకీయాలప్పుడు ప్రధాన నాయకులు తమ అనుచర ఎమ్మెల్యేలు, మంత్రులను తీసుకుని రిసార్టుల్లో మకాం వేస్తున్నారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్‌ చేసే ఎమ్మెల్యేలకు ఈ రిసార్టు రాజకీయ క్రీడలో మంచి ఫలితమే దక్కుతోంది. ఎంత ఖర్చయినా సరే  రిసార్టు, ఫైవ్‌స్టార్, సెవెన్‌ స్టార్‌ హోటళ్లలో వారాల పాటు రెబెల్‌ ఎమ్మెల్యేలను ఉంచి కాపాడుకుంటుంటారు. ప్రతినిత్యం వారికి భోజనాలు, గదుల దగ్గరి నుంచి అన్ని వ్యవహారాలకు చాలా భారీగా ఖర్చు అవుతుంది. కొత్త అల్లుళ్ల తరహాలో ఆతిథ్యం ఉంటుంది.

కర్ణాటకలో చాలా అత్యున్నత హైఫై సౌకర్యాలతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన రిసార్టులు ఉన్నాయి. కొన్నిరోజుల విడిది ఖర్చు కోట్ల రూపాయల్లోనే, అయినా పార్టీలు వెనుకంజ వేయవు. అంతేకాకుండా అన్ని జాతీయ పార్టీల రిసార్టు రాజకీయాలకు బెంగళూరు భద్రం అనుకుంటారు. యడియూరప్ప, కుమారస్వామి, సిద్ధరామయ్య ఇలా అన్ని ప్రధాన పార్టీల నాయకులు రిసార్టు రాజకీయాలు నడిపినవారే కావడం గమనార్హం. కొన్నిసార్లు తమ ఎమ్మెల్యేలు జారిపోకుండా, మరికొన్నిసార్లు ప్రత్యర్థి సంఖ్యాబలాన్ని తగ్గించేందుకు రిసార్టులను ఆశ్రయించారు.  చదవండి: నా ప్రమాణం తర్వాత మాట్లాడతా

1984లో ఏపీతో నాంది: సుమారు 36 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి రిసార్టు రాజకీయం ప్రారంభమైంది. 1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు రాజకీయ సంక్షోభం నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను కర్ణాటకకు తరలించారు. ఆ సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న రామకృష్ణ హెగ్డే ఎన్టీఆర్‌కు ఎంతో సహకారం అందించారు. సుమారు ఒక నెల పాటు బెంగళూరులోని దాస్‌ ప్రకాశ్‌ హోటల్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు మకాం వేశారు. 2002లో మహారాష్ట్ర సీఎం విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ విశ్వాస పరీక్ష ఎదుర్కొనే సమయంలో తమ పార్టీకి చెందిన సుమారు 71 మంది ఎమ్మెల్యేలను మైసూరు రిసార్టులకు తరలించారు. 2004లో జేడీఎస్‌ పార్టీకి చెందిన 58 ఎమ్మెల్యేలను కూడా అప్పట్లో రిసార్టుకు తరలించారు. గత 16 ఏళ్లలో రిసార్టు రాజకీయాల వల్ల మూడు ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top