జీవవైవిధ్యాన్ని కాపాడుదాం

Reiterate pledge to preserve biodiversity SAYS PM Narendra Modi - Sakshi

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని పిలుపు

న్యూఢిల్లీ: భవిష్యత్‌ తరాల కోసం భూమిని సంరక్షించుకోవడానికి సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ప్రధాని ట్విటర్‌లో తన సందేశాన్ని ఉంచారు. ‘‘చెట్టు, చేమ భూమిపై నున్న సమస్త జీవజాలాన్ని కాపాడుకోవడానికి మనమంతా సమష్టిగా చేయగలిగినదంతా చేయాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన భూమిని సుసంపన్నం చేసే జీవవైవిధ్యాన్ని కాపాడతామని అందరూ ప్రతిన బూనాలి’’అని ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు. భవిష్యత్‌ తరాల వారు ఈ భూమిపై హాయిగా జీవించేలా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని నొక్కి చెప్పారు.

మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో తాను ప్రస్తావించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘‘ఈ ఏడాది థీమ్‌ జీవ వైవిధ్యం. ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్ధితుల్లో ఇది అత్యంత అవసరం, గత కొద్ది వారాల లాక్‌డౌన్‌ సమయంలో జనజీవనం కాస్త నెమ్మదించింది కానీ, మన చుట్టూ ఉన్న ప్రకృతి, జీవవైవిధ్యం గురించి ఆలోచించే అవకాశమైతే వచ్చింది’’అని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. వాయుకాలుష్యం, శబ్ద కాలుష్యంతో ఇన్నాళ్లూగా ఎన్నో రకాల పిట్టలు అదృశ్యమైపోయాయని, ఈ లాక్‌డౌన్‌ కారణంగా పొద్దున్న లేస్తూనే మళ్లీ శ్రావ్యమైన పక్షుల కిలకిలారావాలు వినే అవకాశం ప్రజలకు వచ్చిందన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top