రేప్ చేయండి.. నగ్నంగా ఊరేగించండి... | rape the sister, says UP khap panchayat for brother's action | Sakshi
Sakshi News home page

రేప్ చేయండి.. నగ్నంగా ఊరేగించండి...

Aug 19 2015 11:06 AM | Updated on Sep 3 2017 7:44 AM

రేప్ చేయండి.. నగ్నంగా ఊరేగించండి...

రేప్ చేయండి.. నగ్నంగా ఊరేగించండి...

ఉత్తర ప్రదేశ్ భాగ్పట్ జిల్లాలోని ఒక గ్రామంలో ఇద్దరు దళిత మహిళలను అత్యాచారం చేసి, గ్రామంలో నగ్నంగా ఊరేగించాలంటూ పంచాయతీ పెద్దలు హుకుం జారీ చేశారు.

న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ లో  మనసులను కలచివేసే మరో ఖాప్ పంచాయితీ తీర్పు  ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  భాగ్పట్ జిల్లాలోని ఓ గ్రామంలో  ఇద్దరు దళిత యువతులను అత్యాచారం చేసి,  అనంతరం నగ్నంగా ఊరేగించాలంటూ పంచాయతీ పెద్దలు హుకుం జారీ చేశారు. ఇంతకీ  ఆ దళిత యువతి చేసిన నేరం ఏమిటో తెలుసా...  ఆమెకో సోదరుడు ఉండటం.   అతడు  జాట్ కులానికి చెందిన ఓ  అమ్మాయిని  ప్రేమించడం.

వివరాల్లోకి వెళితే దళిత యువకుడు  రవి అదే గ్రామానికి చెందిన  జాట్ కులానికి చెందిన యువతిని ప్రేమించాడు.  అయితే పెద్దలను ఎదిరించే ధైర్యం చేయలేకపోటంతో ఆమె తమ కులానికే చెందిన అబ్బాయిని గత ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుని అత్తారింటికి  వెళ్ళిపోయింది.  కానీ ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేక, పెళ్లాడిన వ్యక్తితో కాపురం చేయలేకపోయింది. దీంతో అక్కడ ఇమడలేక సుమారు ఒక నెల తరువాత అంటే మార్చి నెలలో ప్రేమికుడు రవి దగ్గరికి వచ్చేసింది.  

అంతే  వివాదం రాజుకుంది.  యువతి తరపు బంధువులు, గ్రామ పెద్దలు అగ్గిమీద గుగ్గిలమయ్యారు.  అదిరింపులకు , బెదిరింపులకు, వేధింపులకు  దిగారు.  దీంతో భయపడిపోయిన రవి, ఆ యువతి పోలీసుల ఎదుట లొంగిపోయారు. రవిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయించారు.  అంతటితో  గ్రామపెద్దలు  ఆగ్రహం చల్లారలేదు.   రవి  సోదరి మీనా,  ఆమె  స్నేహితురాలిపై అత్యాచారం చేయాలని ఆజ్ఞలను జారీ చేశారు. ముఖానికి నల్లరంగు పూసి గ్రామంలో నగ్నంగా ఊరేగించాలని  తీర్పు  చెప్పారు. అక్కడితో ఆగకుండా...ఊళ్లో వారుంటున్న ఇంటిని  కూడా ఆక్రమించుకున్నారు.  

ఖాప్ పంచాయితీ  పెద్దల హుకుంతో రవి కుటుంబం ఊరు విడిచిపెట్టి ఢిల్లీకి పారిపోయింది.   ఈ క్రమంలో రవి సోదరి మీనా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  తనకు రక్షణ  కల్పించాల్సిందిగా  కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. తన సోదరుడిపై అక్రమ  కేసులు  పెట్టి వేధిస్తున్నారని,  సీబీఐ   విచారణ జరిపించాలని వేడుకుంది. దీనిపై  ఉన్నత న్యాయస్థానం సీరియస్గా  స్పందించింది   ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాల్సిందిగా  రాష్ట్ర పోలీసులను ఆదేశించింది.    రెండు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని జస్టిస్ చలమేశ్వర్ .... యూపీ పోలీసులకు  నోటీసులు జారీ చేశారు. అయితే ఇందులో తమ తప్పేమీలేదని  మీనా వాపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement