ఓ జాతీయ నేత సొంత ఊర్లో లాంతర్లే దిక్కు | Ram Vilas Paswan's village still in lantern age | Sakshi
Sakshi News home page

ఓ జాతీయ నేత సొంత ఊర్లో లాంతర్లే దిక్కు

Apr 28 2014 6:08 PM | Updated on Aug 14 2018 4:21 PM

ఓ జాతీయ నేత సొంత ఊర్లో లాంతర్లే దిక్కు - Sakshi

ఓ జాతీయ నేత సొంత ఊర్లో లాంతర్లే దిక్కు

నాలుగున్నర దశాబ్దాల క్రితం పాశ్వాన్ గెలిచిన అసౌలీ అసెంబ్లీలో పరిధిలో ఇప్పటికి 44 రెవెన్యూ గ్రామాలకు, 21 పంచాయితీలు విద్యుదీకరణకు నోచుకోలేదనే సమాచారం ఉంది.

ఇంట గెలిచి రచ్చ గెలువాలనే సామెత అందరికి తెలిసిందే. జాతీయ రాజకీయాల్లో చక్రాలు తిప్పే నాయకులు మీడియాలో ఎన్నో హామీలను గుప్పిస్తుంటారు. జాతీయ రాజకీయాల్లో గొప్ప నాయకుడిగా చెలామణి అవుతున్న నేత సొంత గ్రామంలోనే విద్యుత్ సౌకర్యం లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కోతలు లేని విద్యుత్ అందిస్తామని రాజకీయ నేతలు అదను దొరికితే కోతలు కోస్తునే ఉంటారు. భారతదేశంలోని దాదాపు సుమారు అన్ని గ్రామాలు విద్యుదీకరణ జరిగాయని నేతలు సభల్లో గొప్పలు చెప్పుకుంటారు. మీరు నమ్ముతారో లేదో కాని లోక్ జనశక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ స్వంత గ్రామంలో లాంతర్లతోనే ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారట. 
 
జాతీయ స్థాయిలో బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీతో ఎన్నికల పొత్తు పెట్టుకుని రాసుకు తిరుగుతున్న పాశ్వాన్, బీహార్ లోని ఖాగారియా జిల్లాలోని శహర్బాణి సొంత గ్రామంలో ఇంకా లాంతర్లే ప్రజలకు వెలుగునిస్తున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్వంత గ్రామం నలంద జిల్లాలోని కళ్యాణ్ బిఘా, లాలూ ప్రసాద్ యాదవ్ గ్రామం గోపాల్ గంజ్ లోని ఫుల్వారియాలో జరిగిన అభివృద్దికి పూర్తి వ్యతిరేకంగా పాశ్వాన్ గ్రామం చీకటిలో మగ్గుతోంది. ఇంకా దారుణమైన విషయమేమిటంటే 2007 సంవత్సరం తర్వాత ఇప్పటి వరకు పాశ్వాన్ సొంత గ్రామంలో అడుగుపెట్టలేదట. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 1981లో విడాకులిచ్చిన పాశ్వాన్ తొలి భార్య కూడా ఇదే గ్రామంలో లాంతర్లతోనే జీవితం గడుపుతోంది. 
 
నాలుగున్నర దశాబ్దాల క్రితం పాశ్వాన్ గెలిచిన అసౌలీ అసెంబ్లీలో పరిధిలో ఇప్పటికి 44 రెవెన్యూ గ్రామాలకు, 21 పంచాయితీలు విద్యుదీకరణకు నోచుకోలేదనే సమాచారం ఉంది. ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో రాజకీయనాయకులు అశ్రద్ద వహిస్తున్నారని.. కనీసం విద్యుత్ లేకుండానే బ్రతకడమనేది అత్యంత దుర్భరకరమైన విషయమన్నారు. ఖగారియా పార్లమెంట్ పరిధిలోని మరో 50 గ్రామ పంచాయితీలకు కూడా విద్యుత్ సౌకర్యం లేదని ఆ నియోజకవర్గ ప్రజలు వెల్లడిస్తున్నారు. 
 
ఆర్జేడీ అధినేత లాలూ ఎన్నికల గుర్తు లాంతర్ అని.. బీహార్ లోని ప్రజలను లాంతర్ కే పరిమితం చేయడం తప్ప వారి జీవితాల్లో వెలుగు నింపలేదని ప్రస్తుత ఖగారియా ఎంపీ దినేష్ చంద్ర యాదవ్ ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు ఆపి..కనీస వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను ఎత్తుకోవాల్సిందేనని అక్కడి ప్రజలు విజ్క్షప్తి చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే పాశ్వాన్ సొంత గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడం చాలా దారుణమే కాదా!. దేశానికి స్వాతంత్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా ఇలాంటి సంఘటనలు ఇంకా వినాల్సి వస్తోందంటే ఎలాంటి స్థితిలో మనం ఉన్నామో ఊహించుకోవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement