కరోనా పరీక్షలకు మొబైల్‌ ల్యాబ్‌ 

Rajnath Singh Inaugurates DRDO Mobile Testing Lab - Sakshi

సంయుక్తంగా అభివృద్ధి చేసిన డీఆర్‌డీవో, ఈఎస్‌ఐసీ  

లైవ్‌ వీడియో ద్వారా ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ 

సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కట్టడికి దేశ రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీవో) మరో అద్భుత సాధనాన్ని అందుబాటులోకి తెచ్చింది. కరోనా పరీక్షల నిర్వహణకు ‘మొబైల్‌ వైరాలజీ రీసెర్చ్‌ అండ్‌ డయాగ్నస్టిక్స్‌ లేబొరేటరీ (ఎంవీఆర్‌డీఎల్‌)’పేరుతో కదిలే పరిశోధనశాలను సిద్ధం చేసింది. డీఆర్‌డీవో, ఈఎస్‌ఐసీ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ ల్యాబ్‌.. కరోనా పరీక్షలతో పాటు వైరస్‌ కల్చర్, వ్యాక్సిన్‌ తయారీపై పనిచేయనుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ దీనిని గురువారం లైవ్‌ వీడియో ద్వారా ప్రారంభించి హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రికి అందించారు.

కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు కే.తారకరామారావు, చామకూర మల్లారెడ్డి, డీఆర్‌డీఓ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి పాల్గొన్నారు. రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న సమాయానుకూల నిర్ణయాలతో కరోనా వైరస్‌ను సమర్థంగా కట్టడి చేయగలిగామని చెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో కేసుల సంఖ్య తక్కువగా ఉందన్నారు. కరోనాపై జరుగుతున్న పోరులో దేశ రక్షణ దళాలు వివిధ స్థాయిల్లో సేవలందిస్తున్నాయని ప్రశంసించారు.  

హైదరాబాద్‌కే ఈ తొలి సదుపాయం.. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి.. డీఆర్‌డీవో శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. ఇటువంటి సదుపాయం హైదరాబాద్‌లో మొదట అందుబాటులోకి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి దేశవ్యాప్తంగా 304 టెస్టింగ్‌ ల్యాబ్‌లను, 755 కోవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రులను సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతం కరోనా పేషెంట్లకు 1.86 లక్షల పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు.

రాష్ట్ర మంత్రి కే.తారకరామారావు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు 20 రోజుల్లోనే 1,500 పడకలతో టిమ్స్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో పాటు లాక్‌డౌన్‌ను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామన్నారు. లాక్‌డౌన్‌ రోజుల్లో 88 లక్షల మందికి బియ్యం, నగదు పంపిణీ చేశామన్నారు. డీఆర్‌డీవో ఛైర్మన్‌ డాక్టర్‌ సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌లో వైరస్‌ నిర్ధారణ పరీక్షలతోపాటు టీకా అభివృద్ధి, మందుల తయారీ కార్యక్రమాలు వేగవంతమవుతాయన్నారు.  
 
రోజుకు వెయ్యి పరీక్షల సామర్థ్యం 
మొబైల్‌ వైరాలజీ రీసెర్చ్‌ అండ్‌ డయాగ్నస్టిక్స్‌ లేబరేటరీ అభివృద్ధిలో ఈఎస్‌ఐసీతో కలిసి డీఆర్‌డీవో రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (ఆర్‌సీఐ) కీలకపాత్ర పోషించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు తగ్గట్టుగా తయారైన ఈ వ్యాన్లలో బయోసేఫ్టీ లెవెల్‌ (బీఎస్‌ఎల్‌) –2, లెవెల్‌ –3 కార్యకలాపాలు నిర్వహించవచ్చు. ఇందులో అన్ని ఎలక్ట్రానిక్‌ కంట్రోలర్లతోపాటు కంప్యూటర్‌ నెట్‌వర్క్‌కు అవసరమైన ల్యాన్, టెలిఫోన్, సీసీటీవీలు ఉన్నాయి. దేశంలోనే తొలిదైన ఈ మొబైల్‌ ల్యాబ్‌లో వైరస్‌ను, దానికి మందులను గుర్తించేందుకు, అందుకు వీలుగా వైరస్‌ను పెంచేందుకు కూడా ఉపయోగపడుతుంది.

రోగ నిరోధక వ్యవస్థ స్వరూప స్వభావాలను అర్థం చేసుకునేందుకు కావాల్సిన పరీక్షలూ నిర్వహించవచ్చు. కరోనా టీకా అభివృద్ధి, వైరస్‌ కల్చర్, డ్రగ్‌ స్క్రీనింగ్, వ్యాక్సిన్‌ డెవలప్‌మెంట్, ప్లాస్మా థెరపీ, ఇమ్యూన్‌ ప్రొఫైలింగ్‌ పరీక్షలతో పాటు క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించే సామర్థ్యం దీనికి ఉంది. అవసరాన్ని బట్టి దీన్ని దేశంలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. రోజుకు సగటున వెయ్యి పరీక్షలు చేయవచ్చు. మొబైల్‌ వ్యాన్‌ తయారీలో ఐకామ్, ఐక్లీన్‌ సంస్థలు బీఎస్‌ఎల్‌–2, 3 ప్రమాణాలతో దీనిని డిజైన్‌ చేశాయని, హైటెక్‌ హైడ్రాలిక్స్‌ అనే సంస్థ స్థూల నిర్మాణాన్ని అందించిందని డీర్‌డీవో తెలిపింది. సాధారణంగా ఇలాంటి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ల్యాబ్‌ తయారీకి ఆర్నెళ్లు పడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో త్వరగా అందుబాటులోకి తేవాలని భావించిన డీఆర్‌డీఏ.. ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజీ శాస్త్రవేత్తల సహకారంతో 15 రోజుల్లోనే దీనికి రూపకల్పన చేసింది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top