నెట్‌ సర్వీసులను నిలిపివేయడం నేరమే!

Rajasthan Suspend Internet During Constable Recruitment Exam - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్, జైపూర్, జోద్‌పూర్‌ నగరాల్లో మూడు రోజుల క్రితం అంటే, 14, 15 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్‌ సర్వీసులను సంపూర్ణంగా షట్‌డౌన్‌ చేసింది. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అవడం వల్లనో, పిల్లలను ఎత్తుకుపోయే కిడ్నాపర్లు తచ్చాడుతున్నారంటూ వదంతులు వ్యాపిస్తున్నాయన్న కారణంగానో, మత విద్వేషాల కారణంగానో ఇంటర్నెట్‌ను షట్‌డౌన్‌ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. కేవలం పరీక్షల పేరిట, అందులోను పోలీసు కానిస్టేబుళ్ల నియామక పరీక్షల కోసం నెట్‌ సర్వీసులను నిలిపి వేశారంటే ఆశ్ఛర్యం కలుగుతోంది.

రాష్ట్రంలో 13000 వేల పోలీసు ఉద్యోగాల కోసం 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఉండడంతో మూడు నగరాల్లో పరీక్షా కేంద్రాల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. అత్యాధునిక పద్ధతుల్లో కాపీ కొట్టకుండా అభ్యర్థులను నివారించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వ అధికారులు వివరించారు. ఇంటర్నెట్‌ సర్వీసులను ఎప్పుడు, ఎలా ఉపయోగించుకోవడం అన్నది ప్రజల స్వేచ్ఛ. పరీక్షల పేరిట ప్రజల స్వేచ్ఛను హరించడం అన్యాయమని ప్రజా సంఘాలు వాదిస్తున్నాయి. పరీక్షలకు ఎంత మంది అభ్యర్థులు హాజరయ్యారన్నది ఇక్కడ ముఖ్యంకాదని ఆ సంఘాలు పేర్కొన్నాయి. ఆ మాటకొస్తే ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆ విషయంలో ఘోరంగా విఫలమవడమే అధిక పోటీకి కారణమని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కాపీ కొడతారన్న కారణంగా పరీక్షల సందర్భంగా ఇంటర్నెట్‌ సౌకర్యాలను పూర్తిగా నిలిపివేయడం అంటే నీటిని తస్కరిస్తున్నారనో, వృధా చేస్తున్నారన్న కారణంగా ప్రజలందరికి నీటి సరఫరాను నిలిపివేయడంలా ఉందని ఆ సంఘాలు ఆరోపించాయి. ప్రజల స్వేచ్ఛను హరించే ఏ నిర్ణయమైన అది నేరమే అవుతుందని విమర్శించాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top