రాజస్థాన్‌లో పెట్రోలియం వర్సిటీ 

Rajasthan Government To Set Up Petroleum University - Sakshi

జైపూర్‌ : రాజస్థాన్‌లో త్వరలో పెట్రోలియం విశ్వవిద్యాలయం ఏర్పాటుకానుంది. ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. అదేవిధంగా జోధ్‌పూర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో పెట్రోలియం ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లమో కోర్సును అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్‌గార్గ్‌ శాసనసభ దృష్టికి తీసుకొచ్చారు. మెకాట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌తోపాటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఆటోమొబైల్‌ డిజైన్‌ కోర్సు సిలబస్‌ను మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు.

జిల్లాస్థాయిలో మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలను కొత్తగా ప్రారంభిస్తామన్నారు. అందులో నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కోటాలోని రాజస్థాన్‌ టెక్నికల్‌ విశ్వవిద్యాలయంలో  2017–18 విద్యాసంవత్సరం నుంచి చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. వివిధ విద్యాసంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ఇందువల్ల స్వల్పకాలంలోనే 13 స్టార్టప్‌లు రాష్ట్రంలో మొదలయ్యాయన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృషిలో పెట్టుకుని ఈ యూనివర్సిటీ అనేక శిక్షణా శిబిరాలను నిర్వహించిందని తెలిపారు. 2018–19 విద్యాసంవత్సరానికి గాను ఈ విశ్వవిద్యాలయానికి రూ. కోటి మేర నిధులు మంజూరు చేశామన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతోపాటు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడం కోసం విద్యావిభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని గార్గ్‌ చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top