
మడికెరిలో కొండచరియలు పడి ధ్వంసమైన భవనం
సాక్షి బెంగళూరు: కర్ణాటకలో కోస్తా సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇళ్లు, భవనాల గోడలు కూలిపోయి గురువారం 9 మంది దుర్మరణం పాలయ్యారు. కల్బుర్గి జిల్లా ఆళందలో ఇంటిగోడ కూలిన ఘటనలో తల్లి, ఇద్దరు కూతుళ్లు చనిపోయారు. కొడగు జిల్లా మడికెరి సమీపంలో కొండవాలు కుంగిపోవడంతో ఒక భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మృత్యువాతపడ్డారు. మరొకరు గాయపడ్డారు. వేర్వేరు జిల్లాల్లో విద్యుత్ షాక్, ఇతర ప్రమాదాల కారణంగా ముగ్గురు మరణించారు. కేరళను ఆనుకుని ఉన్న దక్షిణ కన్నడ, ఉడుపి, చిక్కమగళూరు, కొడగు తదితర జిల్లాల్లో వారం రోజుల నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వందలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. తుంగభద్ర, కేఆర్‌ఎస్ సహా ఇతర డ్యామ్‌లన్నీ పొంగిపొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.