భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం

Rabri Devi Adorable Wishes To Lalu Yadav On His Birthday - Sakshi

పట్నా : ‘ప్రాణ సమానులు, గౌరవనీయులైన శ్రీ లాలూ ప్రసాద్‌ గారికి 72వ జన్మదిన శుభాకాంక్షలు. నా ఆయుష్షు కూడా పోసుకుని మీరు కలకాలం వర్ధిల్లాలి’ అని బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి తన భర్త, ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లాలూతో కలిసి దిగిన ఫొటోను ఆమె ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ క్రమంలో లాలూ ప్రసాద్‌కు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా లాలూ ప్రసాద్‌ యాదవ్‌ 1948, జూన్‌ 11న బిహార్‌లో జన్మించారు. 1973లో రబ్రీదేవిని వివాహమాడిన ఆయనకు.. ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌ ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరు రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

ఇక రాష్ట్రీయ జనతాదళ్‌ పార్టీని స్థాపించిన లాలూ బిహార్‌ ముఖ్యమంత్రిగా, రైల్వే శాఖమంత్రిగా, ఎంపీగా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలు ఎదుర్కొన్న లాలూ.. ప్రస్తుతం దాణా కుంభకోణం కేసులో రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఆర్జేడీకి ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ కనీసం ఒక్క స్థానమైనా దక్కించుకోగా.. స్థానిక పార్టీ అయిన ఆర్జేడీ అసలు ఖాతా కూడా తెరవలేక చతికిలపడింది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు లాలూ జన్మదిన వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. ఈ క్రమంలో పుట్టిన రోజు సందర్భంగా పలువురు నేతలు బిర్సా ముండా జైలులో లాలూను కలిసినట్లు సమాచారం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top