
న్యూఢిల్లీ: దేశంలో ప్రజా రవాణా వ్వవస్థలో కార్యకలాపాలను త్వరలోనే పున:ప్రారంభించనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పా రు. ఆయన బుధవారం ‘బస్సు, కార్ ఆపరేటర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడా రు. ప్రజారవాణాను ప్రారంభించే విష యంలో భౌతిక దూరం పాటించడం, ఫేసు మాస్కులు, శానిటైజర్లు వాడడం వంటి నిబంధనలతో మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఆపరేటర్లు ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందన్నారు.
గ్లోబల్ మార్కెట్‌లో పాగా వేయండి
కరోనా వల్ల తలెత్తిన విపత్తును అవకాశంగా మార్చుకోవాలని ప్రజా రవాణా రంగంలోని పెట్టుబడిదారులకు గడ్కరీ సూచించారు. గ్లోబల్ మార్కెట్‌లో పాగా వేయడంపై దృష్టి పెట్టాలన్నారు. కరోనాపై, దిగజారుతున్న ఆర్థిక పరిస్థితిపై భారత్ తప్పనిసరిగా విజయం సాధిస్తుందన్నారు. ప్రభుత్వ పెట్టుబడి స్వల్పంగా, ప్రైవేట్ వ్యయం అధికంగా ఉండే లండన్ తరహా ప్రజా రవాణాను మన దేశంలోనూ ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. హైవే ప్రాజెక్టుల పనులను పున:ప్రారంభించడంపై ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.