ప్రధాని సభకు డుమ్మా | Sakshi
Sakshi News home page

ప్రధాని సభకు డుమ్మా

Published Thu, Aug 21 2014 11:19 PM

ప్రధాని సభకు డుమ్మా - Sakshi

సాక్షి ముంబైః ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా నాగపూర్ జిల్లాలో గురువారం నిర్వహించిన రెండు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ గైర్హాజరయ్యారు. ముందుగా పేర్కొన్నట్టుగానే వీరు ఈ కార్యక్రమాలను బహిష్కరించారు. వీరితోపాటు జిల్లా ఇంచార్జ్ మంత్రి నితిన్ రావుత్ కూడా హాజరుకాలేదు.   పుణే, షోలాపూర్‌లో ఇటీవల జరిగిన కార్యక్రమాల సందర్భంగా నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి కొన్ని విమర్శలు చేయడం తెలిసిందే.

బొగ్గు కుంభకోణం, యూపీఏ అవినీతి వంటి అంశాలను ప్రస్తావించడంతో చవాన్ ఇబ్బందిపడ్డారు. మోడీ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రాజకీయ ప్రయోజనాల కోసమే నాగపూర్ మెట్రో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకే తాను ఈ కార్యక్రమానికి వెళ్లడంలేదని, ప్రభుత్వం తరఫున ఒక అధికారి మాత్రం వెళ్లనున్నట్టు పృథ్వీరాజ్ చవాన్ ప్రకటించారు.

 ముఖ్యమంత్రి నిర్ణయం సబబుకాదు: బీజేపీ
 ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ తీసుకున్న నిర్ణయం సబబుకాదని ప్రతిపక్ష నాయకుడు వినోద్ తావ్డే పేర్కొన్నారు. అభివృద్ధిలో బాగంగా ఎంతో కీలకమైన ప్రాజెక్టుల కోసం నిర్వహించిన కార్యక్రమానికి స్వయానా ముఖ్యమంత్రి హాజరుకావడం లేదని ప్రకటించడంపై మండిపడ్డారు. పృథ్వీరాజ్ చెప్పినట్టుగా ప్రధాని ఎవరినీ అవమానించలేదన్నారు.  చవాన్ చర్య రాజ్యాంగ విరుద్ధమని  ఆక్షేపించింది.  

 చవాన్ చర్య సరైందే: కాంగ్రెస్
 నాగపూర్‌లో మోడీ సభకు గైర్హాజరు కావాలని సీఎం చవాన్ నిర్ణయం సరైందేనని కాంగ్రెస్ పేర్కొంది. ప్రధాని సభల్లో ముఖ్యమంత్రులతో వ్యవహరించే విధానం సరిగ్గా లేనందునే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఎంపీసీసీ స్పష్టం చేసింది. షోలాపూర్‌లో శనివారం నిర్వహించిన సభలో చవాన్ ప్రసంగిస్తున్నప్పుడు బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారని ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావు ఠాక్రే ఆరోపించారు.

Advertisement
Advertisement