ఆకాశానికి ‘పెట్రో’ మంట | Petrol and Diesel Prices Hiked | Sakshi
Sakshi News home page

ఆకాశానికి ‘పెట్రో’ మంట

May 21 2018 1:06 AM | Updated on Jul 6 2019 3:22 PM

Petrol and Diesel Prices Hiked - Sakshi

సాక్షి, సిటీబ్యూరో / న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ(ఓఎంసీ)లు వినియోగదారులకు మరోసారి షాకిచ్చాయి. ఆదివారం లీటర్‌ పెట్రోల్‌పై 33 పైసలు, డీజిల్‌పై 26 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తాజా నిర్ణయంతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.76.24, డీజిల్‌ రూ.67.57కు చేరుకుంది. దీంతో పెట్రోల్, డీజిల్‌లు ఆల్‌టైం గరిష్టానికి చేరుకున్నట్లయింది. కర్ణాటక ఎన్నికల అనంతరం మే 14 నుంచి వరుసగా ఏడు రోజులపాటు చమురు ధరల్ని ఓఎంసీలు పెంచాయి. దీంతో వారంలో లీటర్‌ పెట్రోల్‌పై రూ.1.61, డీజిల్‌పై రూ.1.64 మేర ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం గతేడాది జూన్‌లో రోజువారీ చమురు ధరల సవరణ విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.84.07తో ముంబై తొలిస్థానంలో నిలవగా.. అమరావతి(రూ.82.35), భోపాల్‌(రూ.81.83), పట్నా(రూ.81.73), హైదరాబాద్‌(రూ.80.76)లు తర్వాతిస్థానాల్లో నిలిచినట్లు ఓఎంసీలు ధరల నోటిఫికేషన్‌లో పేర్కొన్నాయి. లీటర్‌ డీజిల్‌ ధర రూ.74.75తో అమరావతి దేశంలోనే తొలిస్థానంలో నిలవగా.. హైదరాబాద్‌(రూ.73.45), తిరువనంతపురం(రూ.73.34), రాయ్‌పూర్‌(రూ.72.96), గాంధీనగర్‌(రూ.72.63) తర్వాతిస్థానాల్లో నిలిచాయి. 
            హైదరాబాద్‌      అమరావతి 
పెట్రోల్‌    రూ.80.76       రూ.82.35 
డీజిల్‌     రూ.73.45       రూ.74.75 

పన్నుల మోత.. 
దేశంలో పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకాలను, రాష్ట్ర ప్రభుత్వం అమ్మకపు పన్నుతో పాటు వ్యాట్‌ను విధిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీ కింద పెట్రోల్‌పై రూ.21.48, డీజిల్‌పై రూ.17.33 వసూలు చేస్తోంది. మరోవైపు ఒక్కో రాష్ట్రం ఒక్కో రేటుతో వ్యాట్, అమ్మకపు పన్నును వసూలు చేస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్‌ 27 శాతం వ్యాట్‌ను విధిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్‌ విధిస్తున్నప్పటికీ ప్రతి లీటర్‌పై రూ.4 లు అదనపు వ్యాట్‌ వసూలు చేస్తుండటంతో మొత్తం పన్ను 38.82 శాతానికి చేరుకుంది. అలాగే డీజిల్‌పై 22.25 శాతం పన్నుతో పాటు అదనంగా లీటర్‌పై రూ.4 వ్యాట్‌ను విధిస్తున్నారు. దీంతో స్థూలంగా డీజిల్‌పై వ్యాట్‌ 30.71 శాతానికి చేరుకుంది. మొత్తంమీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పెట్రోల్‌పై 57 శాతం, డీజిల్‌పై 44 శాతం పన్నులతో వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement