65 ఏళ్ల ఈ యువకుడికి పెళ్లి ప్రపోజల్స్‌ కష్టాలు!

Patna Professor Retires At 65 Wants To Remarry - Sakshi

‘నేను అరవై ఐదేళ్ల యువకుడిని. రిటైర్‌ అయిన తర్వాత ఏం చేస్తావని అందరూ నన్ను అడుగుతున్నారు. ఇంకేం ఉంటుంది.. నేను మరోసారి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎంతో మంది అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు నా వెంట పడుతున్నారు. పెళ్లి చేసుకోవాలంటూ విసిగిస్తున్నారు. కానీ ఈ విషయంలో తుది నిర్ణయం నా విద్యార్థులదే. చాలా కన్ఫ్యూజింగ్‌గా ఉంది. ఏదో ఒకటి తొందరగా తేల్చేయండి మిత్రులారా’ ఇది బిహార్‌ ‘లవ్‌గురు’గా పేరొందిన ప్రొఫెసర్‌ ముథుక్‌నాథ్‌ చౌదరి ఫేస్‌బుక్‌ పోస్ట్‌ సారాంశం. పదవీ విరమణ పొందిన తర్వాత వస్తున్న పెళ్లి కష్టాల గురించి ఇలా ఏకరువు పెట్టారు ఆయన.

పట్నా యూనివర్సిటీకి చెందిన బీఎన్‌ కాలేజీలో హిందీ ప్రొఫెసర్‌గా పనిచేసే ముథుక్‌నాథ్‌ చౌదరి.. వయసులో తన కంటే 30 ఏళ్లు చిన్నదైన తన స్టూడెంట్‌ జూలీని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచారు. 2006లో మొదలైన వీరి బంధం సుమారు దశాబ్ద కాలంపాటు కొనసాగింది. గతేడాది భర్త నుంచి విడిపోయిన జూలీ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది. ఈ క్రమంలో బుధవారం పదవీ విరమణ పొందిన చౌదరిని.. మీ తదుపరి నిర్ణయం ఏమిటి అని అడిగిన విద్యార్థులకు ఇలా ఫేస్‌బుక్‌ పోస్టుతో దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ఈ వృద్ధ యువకుడి వాలకం చూస్తుంటే ‘ముసలోడికి దసరా పండుగ’  అనే సామెత గుర్తుకువస్తోంది కదా అంటూ కొంతమంది నెటిజన్లు చమత్కరిస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. ‘ఇందులో తప్పేం ఉంది. పెళ్లికి వయసుతో ఏం సంబంధం’ అంటూ ప్రొఫెసర్‌ నిర్ణయాన్ని గౌరవిస్తున్నారు. మరి మీరేం ఏమంటారో!?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top