పకోడీలు అమ్ముకుంటే ఉద్యోగం ఎందుకు?

Pakodanomics By Narendra Modi on Jobs Issue - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే ఏడవ బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత్‌కు ఇప్పుడు ‘పకోడీ’ల సెగ ఎక్కువగా తగులుతోంది. యువతకు ఏటా కోటి ఉద్యోగాలు కల్పిస్తానన్న హామీతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ కొత్తగా పకోడీల ఫిలాసఫీని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. కోటి ఉద్యోగాల మాట గుర్తు చేసినప్పుడల్లా ఆయనకు కోపం వస్తున్నట్లు ఉంది.

జనవరి 26వ తేదీన ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పకోడీలు అమ్ముకుంటూ బతుకుతున్న వ్యక్తిని కూడా ప్రభుత్వం నిరుద్యోగుల జాబితాలో చేరుస్తుందని, వాస్తవానికి స్వయం ఉపాధిని నమ్ముకుని బతుకుతున్నవారు భారత్‌లో హాయిగా జీవిస్తున్నారని, వారిని నిరుద్యోగ సమస్య పీడించడం లేదని సమర్థించుకున్నారు.

పకోడీలు అమ్ముకోవడం కూడా ఓ ఉద్యోగమేనా అని ప్రతిపక్షం పార్లమెంట్‌లో ప్రశ్నించినప్పుడు పార్లమెంట్‌లో మొదటిసారిగా ప్రసంగిస్తున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు కోపం వచ్చింది. పకోడీలను అమ్ముకుంటూ బతుకుతున్నవారిని అవమానిస్తున్నారంటూ విపక్షాలపై విరుచుకుపడ్డారు. చాయ్‌వాలా దేశ ప్రధానైనా భారత దేశంలో పకోడీవాలా ఏమైనా కావచ్చని అన్నారు. అంబానీ కూడా అవుతారన్నది ఆయన ఉద్దేశమేమో!

ఏమాటకామాట చెప్పాలంటే ప్రభుత్వ నివేదికల ప్రకారం యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2013–2014 ఆర్థిక సంవత్సరంలో దేశంలో నిరుద్యోగుల సంఖ్య 3.4 శాతం కాగా, అది 2017–18 ఆర్థిక సంవత్సరానికి ఆది 3.7 శాతానికి చేరుకుంది. దేశంలో ప్రతి నాలుగు కుటుంబాల్లో మూడు కుటుంబాలకు, అంటే దాదాపు 77 శాతం మందికి క్రమబద్ధమైన ఆదాయం లేదని 2017, ఫిబ్రవరి 6వ తేదీన అప్పటి కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పార్లమెంట్‌కు  వెల్లడించిన విషయానికి ప్రభుత్వ నిరుద్యోగ అంచనాలకు పొంతనే లేదు. దేశంలోని నిరుద్యోగులను కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో అశాస్త్రీయంగా లెక్క కడుతోంది. దత్తాత్రేయ లెక్కలతో పోల్చినా ఈ విషయం స్పష్టం అవుతుంది.
 
నరేంద్ర మోదీ పాలనలో ఇప్పటి వరకు 2016 సంవత్సరంలోనే యువతకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి. ఆ ఏడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ నెలవరకు, 9 నెలల కాలంలో దాదాపు మూడు లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం ఏటా పది లక్షల మంది యువత ఉద్యోగాల కోసం మార్కెట్‌లోకి వస్తుంది. అంటే ఏడాదికి కోటి ఇరవై లక్షల మంది అన్న మాట. అందుకే మోదీ గారు ఏటా కోటి ఉద్యోగాలు కల్పిస్తానంటూ మాట ఇచ్చి ఉంటారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీల అమలుతో ఆయన ఆర్థిక అంచనాలన్నీ తలికిందులవడంతో నిరుద్యోగం గురించి మాట్లాడితే పకోడీల ఫిలాసఫీ చెబుతున్నట్టున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top