
న్యూఢిల్లీ: ఆర్మీ లేదా పోలీసు శాఖలో ‘అమర వీరుడు’లేదా ‘షహీద్’అనే పదాలే లేవని రక్షణ శాఖ, హోంశాఖలు తేల్చిచెప్పాయి. ఏదైనా ఘటనలో ఆర్మీ అధికారి చనిపోతే ‘యుద్ధంలో మరణించినవారు’, పోలీసులు చనిపోతే ‘పోలీస్ చర్యల్లో మరణించినవారు’ అని పేర్కొంటారని తమ నివేదికలో కేంద్ర సమాచార కమిషన్‌కు తెలిపాయి. ‘షహీద్’ లేదా ‘అమరవీరుడు’ పదాలకు న్యాయపరంగా, రాజ్యాంగ పరంగా అర్థం చెప్పాలంటూ ఓ సమాచార హక్కు కార్యకర్త హోం శాఖకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ పదాల వాడుకపై పరిమితులు.. అలాగే తప్పుగా వాడితే ఎలాంటి శిక్ష విధిస్తారో తెలియజేయాలని కోరాడు. ఈ దరఖాస్తుకు హోం, రక్షణ శాఖల్లో స్పందన రాకపోవడంతో కేంద్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించాడు.