
ఆ కోటరీని దూరం పెట్టకపోతే కష్టం!
కేంద్ర కేబినెట్‌లో ఒక సామాజికవర్గానికే పెద్దపీట వేసి, ఎక్కడలేని ప్రాధాన్యతను కల్పించడాన్ని జాతీయస్థాయిలోని బీజేపీ సీనియర్ నాయకులే జీర్ణించుకోలేకపోతున్నారట.
కేంద్ర కేబినెట్‌లో ఒక సామాజికవర్గానికే పెద్దపీట వేసి, ఎక్కడలేని ప్రాధాన్యతను కల్పించడాన్ని జాతీయస్థాయిలోని బీజేపీ సీనియర్ నాయకులే జీర్ణించుకోలేకపోతున్నారట. ఇలాగైతే కష్టమని, త్వరలోనే ఈ పరిస్థితిలో మార్పు తీసుకురాకపోతే దేశంలోని ఆయా రాష్ట్రాల్లో పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరికలు కూడా చేస్తున్నారట. ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభు, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి కల్‌రాజ్‌మిశ్రా, ఎరువులు, రసాయనాల మంత్రి యు.అనంతకుమార్, ఓ.పి.శర్మ, పర్యావరణశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్, సహాయమంత్రులు నిర్మలాసీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్‌లకు ఇస్తున్న ప్రాముఖ్యతను తగ్గించాలనే సూచనలను ఆయా వేదికలపై చేస్తున్నారట. వీరంతా కోటరీగా ఏర్పడి ప్రధాని మోడీని ప్రభావితం చేసి పరిపాలనాపరంగా, రాజకీయంగా తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తున్నారనేది ఈ నాయకుల ముఖ్య ఆరోపణ. వీరి కారణంగానే గతంలో ఢిల్లీ, యూపీ, ఆ తర్వాత బిహార్, తదితర ఎన్నికల్లో తప్పులు చేసి బీజేపీ రాజకీయంగా నష్టపోవాల్సి వచ్చిందంటున్నారు.
అంతే కాకుండా హరియాణాలో ఏర్పడిన పరిస్థితులకు, అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఏర్పడిన రాజకీయ పరిస్థితులకు వీరి సలహాలే కారణమని చెబుతున్నారు. ఈ కేంద్ర మంత్రులంతా ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడంతో ఆయా రాష్ట్రాల్లో వారు చెప్పిందే చెల్లుబాటై, బలమైన జాట్, క్షత్రియ, మరాఠా, వక్కలిగ తదితర వర్గాలు పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని చెబుతున్నారట. ప్రస్తుతం ముఖ్యమైన కేంద్రమంత్రి పదవులను నిర్వహిస్తున్న వారిలో కొందరికి ముఖ్య అధికారప్రతినిధి, తదితర పార్టీపదవులను కట్టబెట్టడం, అప్రధానమైన పోస్టులు ఇవ్వడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దవచ్చునని కూడా పార్టీ, ప్రభుత్వ పెద్దలకు సలహాలు కూడా ఇస్తున్నారట. ఇదే విషయాన్ని ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా దృష్టికి కూడా తీసుకెళ్లారట. ఇందుకు త్వరలోనే మార్పులు మొదలవుతాయని, కొందరికి పార్టీ పదవులు అప్పగించడం ఖాయమని వారు గట్టిగా చెబుతుండడం కొసమెరుపు.