ధూమపానం, కాయిల్స్‌తో క్యాన్సర్‌ రాదట!

No Cancerous Elements In Smoking - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ధూమపానం వల్ల, దోమలను పారదోలేందుకు కాయిల్స్‌ కాల్చడం వల్ల క్యాన్సర్‌ వస్తుందని ఇంతకాలం నమ్ముతూ వస్తున్నాం. అది పొరపాటు అభిప్రాయమని, వాటిల్లో క్యాన్సర్‌ కారకాలు అంతగా లేవని తాజా పరిశోధనలో వెల్లడయింది. కాకపోతే వీటి వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తేలింది. తలుపులు భిగించిన గదుల్లో సిగరెట్లను, దోమల కాయిల్స్‌ను విడివిడిగా వెలిగించినప్పుడు, అవి కాలుతున్నప్పుడు, కాల్చిన తర్వాత ఆయా గదుల వాతావరణంలోకి ఎలాంటి ఖనిజాలు వెలువడ్డాయో పరిశోధకులు అధ్యయనం జరిపారు. అల్యూమినియం, కాపర్, జింక్, కాడిమియం, క్రోమియం, మాంగనీసు, నికిల్, లెడ్, వనడియం, సెలినియం, స్కాండియం తదితర ఖనిజాలు ఉన్నట్లు కనుగొన్నారు.

రెండు రకాల శాంపుల్స్‌ తీసుకొని వాటిలో ఈ ఖనిజాలు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా పరిశీలించారు. రెండింట్లోనూ అల్యూమినియం, కాపర్, జింక్, మాంగనీస్‌ ఖనిజాలు ఎక్కువగా ఉన్నట్లు, కాడిమియం, వాలియం, సెలెనియం తక్కువగా ఉన్నట్లు తేలింది. క్రోమియం, లెడ్, నికిల్‌ వల్ల క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎంతుందన్న విషయంపై కూడా తాము అధ్యయనం జరిపామని, క్యాన్సర్‌ వచ్చే అవకాశం కన్నా అవి తక్కువ స్థాయిలోనే ఉన్నట్లు తేలిందని అధ్యయనానికి అక్షరరూపం ఇచ్చిన ఆగ్రాలోని బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్శిటీ రసాయన శాస్త్ర విభాగం అధిపతి అజయ్‌ తనేజా తెలిపారు.

ఆయన అధ్యయన వ్యాసాన్ని ‘ఎస్‌ఎన్‌ అప్లైడ్‌ సైన్సెస్‌’ జర్నల్‌ ప్రచురించింది. తాము ప్రస్తుతానికి సిగరెట్, వివిధ రకాల మస్కిటో కాయల్స్‌ నుంచి వెలువడుతున్న ఖనిజాలపైనే అధ్యయనం జరిపామని, వీటి నుంచి దాదపు నాలుగువేల రసాయనాలు కూడా వెలువడుతాయని, వాటి వల్ల క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందా? అన్న కోణంలో ఇంకా అధ్యయనం జరపాల్సి ఉందని తనేజా పేర్కొన్నారు. దోమల కాయల్స్‌లో కన్నా సెగరెట్లలోనే కాపర్, జింక్, మాంగనీస్, నికిల్, లెడ్‌ ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే క్యాన్సర్‌ వచ్చే స్థాయిల్లో మాత్రం లేదని, ధూమపాన ప్రియలు ఇళ్లలో, గాలి బయటకు పోని గదుల్లో పొగ తాగకపోవడమే మంచిదని ఆయన సూచించారు.

ముఖ్యంగా ఇంట్లో దోమలను చంపేందుకు లేదా పారదోలేందుకు కాయిల్స్‌ను కాల్చడం వల్ల ఎక్కువ మందిలో శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తనేజా చెప్పారు. ఎక్కువ కాలం వీటికి ఎక్స్‌పోజ్‌ అయితేనే వ్యాధులు వస్తాయని అన్నారు. ఎవరికి, ఎంతకాలంలో వస్తుందన్నది అంచనా వేయలేమని, వారి వారి శరీర తత్వం, ఆరోగ్య పరిస్థితి బట్టి ఈ శ్వాసకోశ వ్యాధులు సంక్రమిస్తాయని ఆయన వివరించారు. కొందరికి శరీరంపై దద్దులు, ఇతర ఎలర్జీలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. దోమలను పారదోలే ‘ఆల్‌ అవుట్‌’ లాంటి ద్రవరూపక ఎలక్ట్రానిక్‌ పరికరాలు కూడా ప్రత్యామ్నాయం కాదని, వాటి ద్వారా కూడా సేంద్రియ రసాయనాలు వెలువడతాయని ఆయన హెచ్చరించారు.

శ్వాసకోస వ్యాధులు కూడా దీర్ఘకాలంలో మరణానికి దారితీస్తాయని, ఈ మరణాలను కూడా వాయు కాలుష్య మరణాల కింద లెక్కించాల్సి ఉంటుందని తనేజా తెలిపారు. వాయు కాలుష్యం కారణంగా ఒక్క 2017లోనే భారత్‌లో 12 లక్షల మంది మరణించినట్లు ‘ది లాన్సెట్‌’ జర్నల్‌ 2018, డిసెంబర్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం తెలియజేస్తోంది. ఇటీవల భారత్‌లోని పలు నగరాల్లో వాయు కాలుష్యం పెద్ద సమస్యగా మారిన విషయం తెల్సిందే. బయటి కాలుష్యం ఎంత ప్రమాదకరమో ఇళ్లలోని వాయు కాలుష్యం కూడా అంతే ప్రమాదకరమని తనేజా హెచ్చరిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top