మందిరానికి ముస్లింలు భూములిస్తున్నారు: యోగి | Sakshi
Sakshi News home page

మందిరానికి ముస్లింలు భూములిస్తున్నారు: యోగి

Published Wed, May 31 2017 7:06 PM

మందిరానికి ముస్లింలు భూములిస్తున్నారు: యోగి

రామజన్మభూమి వివాదాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి కదిలించారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి భూములిస్తామంటూ చాలా ముస్లిం సంస్థలు ముందుకొస్తున్నాయని ఆయన అయోధ్య సాక్షిగా చెప్పారు. ముఖ్యమంత్రి కాక ముందువరకు ఫైర్‌బ్రాండ్ హిందూ నాయకుడైన ఆదిత్యనాథ్.. ఇప్పుడు చాలాకాలం తర్వాత మరోసారి దీని గురించి మాట్లాడారు. ముస్లింలలో ఓ వర్గం ఆలయ నిర్మాణానికి సిద్ధంగా ఉందని, చర్చల ద్వారా తగిన పరిష్కారం పొందేందుకు ఇదే సరైన సమయమని ఆయన చెప్పారు. ఇలాంటి ప్రయత్నాలకు సాయం చేయడానికి యూపీ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. అంతకుముందు ఆయన అయోధ్య పర్యటన సందర్భంగా హనుమాన్ గఢీ, రామ జన్మభూమి ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 84 కోసి పరిక్రమ యాత్ర త్వరలోనే పునః ప్రారంభం అవుతుందని భక్తులకు ఆయన హామీ ఇచ్చారు. ఆ యాత్రను 2013లో విశ్వహిందూ పరిషత్ ప్రారంభించిందని, కానీ గతంలోని అఖిలేష్ ప్రభుత్వం దాన్ని కొనసాగనివ్వలేదని మండిపడ్డారు.

అయోధ్య రాముడి జన్మస్థలమని, అక్కడ రాంలీలా జరిగేలా ప్రభుత్వం చూస్తుందని కూడా ఆదిత్యనాథ్ చెప్పారు. రామజన్మభూమి - బాబ్రీ మసీదు ప్రాంగణం వద్ద గల తాత్కాలిక ఆలయంలో ఆయన సుమారు అరగంట సేపు గడిపారు. ఆ తర్వాత సరయూనది ఒడ్డున ప్రార్థనలు చేశారు. ఆయనతో పాటు ధరమ్ దాస్ కూడా ఉన్నారు. ఈ దాస్‌పైనే కోర్టు పలువురు బీజేపీ అగ్రనేతలతో పాటు అభియోగాలు మోపింది. లక్నోలోని ప్రత్యేక కోర్టుకు ఎల్‌కే అద్వానీ హాజరవడానికి ముందు వీవీఐపీ గెస్ట్‌హౌస్‌లో ఆయనను సీఎం యోగి కలిశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement