ఈ దొంగోడు మంచోడే!

Man Steals Bike to Reach Home Couriers It Back to Owner In Tamil Nadu - Sakshi

చెన్నై: అవ‌స‌రం మ‌నిషిని దొంగ‌ను చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. కానీ అవ‌స‌రం తీరిన త‌ర్వాత దొంగిలించిన వ‌స్తువును తిరిగి దాని య‌జ‌మానికి అప్ప‌గించ‌డ‌మే విశేషం. తంజావూరులోని మ‌న్నార్‌గుడికి చెందిన ప్ర‌శాంత్ అనే వ్య‌క్తి సూలూర్‌లోని ఓ బేక‌రీ షాపులో ప‌నికి కుదిరాడు. లాక్‌డౌన్ వల్ల ప‌ని కూడా లేక‌పోవ‌డంతో ఖాళీగా ఉన్నాడు. అటు అత‌ని కుటుంబం కూడా న‌గ‌రానికి వ‌చ్చి అక్క‌డే చిక్కుకుపోయింది. ఎలాగైనా ఫ్యామిలీతో కలిసి ఇంటికి వెళ్లాల‌ని భావించాడు. కానీ అందుకు స‌రైన మార్గం తోచ‌లేదు. దీంతో అతను ఓ చోట‌ పార్క్ చేసి ఉన్న‌ బైక్‌ ఎత్తుకెళ్లాడు. దాని ద్వారానే స్వ‌గృహానికి చేరుకున్నాడు. ఇదిలా వుండ‌గా స‌ద‌రు బైకు య‌జ‌మాని సురేశ్ కుమార్  మే18న‌ త‌న వాహ‌నం చోరీకి గురైందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (ఇలాంటి దొంగతనం ఎప్పుడూ చూడలేదు)

ప్ర‌స్తుతం క‌రోనా డ్యూటీలో మునిగి తేలుతున్న పోలీసులు లాక్‌డౌన్ త‌ర్వాత విచార‌ణ చేప‌డ‌తామ‌ని బాధితుడితో పేర్కొన్నారు. దీంతో స్వ‌యంగా రంగంలోకి దిగిన సురేశ్‌ చోరీ అయిన బైకు గురించి వెతుకులాట మొద‌లు పెట్టాడు. ఈ క్ర‌మంలో అత‌డికి సీసీటీవీ కెమెరాల్లో బైకు చోరీ అయిన దృశ్యాలు క‌నిపించాయి. ఆ దృశ్యాల్లో ఉన్న వ్య‌క్తి కోసం ఆరా తీయ‌గా పూర్తి వివ‌రాలు తెలిశాయి. అయితే అప్ప‌టికే ఇంటికి చేరుకున్న ప్ర‌శాంత్ అవ‌స‌రం తీరిపోవ‌డంతో రెండు వారాల త‌ర్వాత‌ బైకును తిరిగి దాని య‌జ‌మానికి కొరియ‌ర్ ద్వారా పంపించాడు. దీంతో తిరిగి త‌న బైకు క‌నిపించ‌గానే ఆ య‌జ‌మాని ఆశ్చ‌ర్యానందాలకు లోన‌య్యాడు. పైగా త‌న బైకు ఎప్ప‌టిలాగే ఉండ‌టంతో ఈ ఘ‌ట‌న‌పై కేసు పెట్ట‌దల‌చుకోలేద‌ని తెలిపాడు. (కరోనా ఎఫెక్ట్‌: మెట్రో కీలక నిర్ణయం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top