ఏకకాలంలో ఎన్నికలకు పకడ్బందీ చట్టం

Law panel seeks statute tweak for simultaneous polls - Sakshi

ప్రతిపాదనలు రూపొందించిన లా కమిషన్‌

సూచనలకు ఆహ్వానం

న్యూఢిల్లీ: దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆలోచనపై లా కమిషన్‌ పకడ్బందీగా ప్రతిపాదనలు రూపొందించింది. ఇందుకోసం రాజ్యాంగంలోని కనీసం రెండు నిబంధనలను సవరించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ప్రతిపాదనలను ఖరారు చేసేందుకు ముందుగా రాజ్యాంగ నిపుణులు, రాజకీయ పార్టీలు తదితరుల సూచనలను మే 8వ తేదీలోగా తెలపాలని కోరుతూ ఆన్‌లైన్‌లో ఉంచింది. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం.. లోక్‌సభ, అసెంబ్లీలకు 2019లో మొదటి దశ, 2024లో రెండో దశలోనూ ఎన్నికలు జరుగుతాయి.

దీని కోసం రాజ్యాంగాన్ని, ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరిస్తారు. రాష్ట్రాల అసెంబ్లీల నిబంధనలను కూడా అందుకు  అనుగుణంగా మార్చాల్సి ఉంటుంది. ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం మధ్యలోనే పడిపోతే కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం ఐదేళ్లలో మిగిలిన కాలానికి మాత్రమే అధికారంలో ఉంటుంది. మెజారిటీ రాష్ట్రాల ఆమోదం పొందలేదనే కారణంతో ఈ సవరణలను కోర్టుల్లో పిటిషన్లు చేయకుండా నిరోధించేందుకు రాజ్యాంగంలోనే సవరణలు చేయాలని ప్రతిపాదించింది.

లోక్‌సభ లేదా అసెంబ్లీలో మెజారిటీ పార్టీ నేత ప్రధానమంత్రిగా లేదా ముఖ్యమంత్రిగా ఎన్నికైతేనే ఆ ప్రభుత్వం స్థిరంగా ఉంటుందని ముసాయిదా తెలిపింది. ఏదైనా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే ముందుగా విశ్వాస తీర్మానానికి అవకాశం కల్పించాలన్న ఎన్నికల సంఘం సూచన కూడా ఈ ప్రతిపాదనల్లో ఉంది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top