పెద్ద కొడుకు వ్యవహారం లాలూను ఏం చేస్తుందో..!

Lalu Prasad Yadav Under Stress Due To Tej Pratap Yadav Divorce Issue - Sakshi

రాంచి : పెళ్లై ఆర్నెళ్లయినా కాకుండానే విడాకులు తీసుకుంటామంటూ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్దకొడుకు తేజ్‌ప్రతాప్‌ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. బిహార్‌ మాజీ సీఎం దరోగా రాయ్‌ మనుమరాలు ఐశ్వర్యరాయ్‌, తేజ్‌ ప్రతాప్‌ల వివాహం మే 12వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. అయితే, ‘మేమిద్దరం ఉత్తర, దక్షిణ ధ్రువాల లాంటి వాళ్లం. మాకు ఏ విషయంలోనూ ఏకాభిప్రాయాలు లేవు’ అని తేజ్‌ వెల్లడించారు. ఏదేమైనా విడాకులు తీసుకుంటామని ప్రకటించారు. దీనిపై లాలూ ప్రసాద్‌తో వారం క్రితం తేజ్‌ భేటీ అయ్యారు. (వద్దన్నా.. ఆమెతో పెళ్లి చేశారు) 

కాగా, విడాకులు తీసుకోవద్దని తేజ్‌కు లాలూ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆయన వినిపించుకోలేదని సమాచారం. దీంతో డెబ్బై ఏళ్ల లాలూ తీవ్ర డిప్రెషన్‌కు లోనయ్యాడని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌) వైద్యులు తెలిపారు. ఇప్పటికే షుగర్‌, కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఆయన బాధపడుతున్నారనీ, ఇప్పుడు కుటుంబ వివాదాలు లాలూను తీవ్రంగా బాధిస్తున్నాయని అన్నారు. తేజ్‌ను కలిసినప్పటి నుంచి ఆయన నిద్రలేమితో బాధపడుతున్నారని చెప్పారు. ఇవన్నీ ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వైద్యులు తెలిపారు. 

ప్రొవిజనల్‌ బెయిల్‌పై బయటికొచ్చిన లాలూ.. 
దాణా కుంభకోణం కేసులో లాలూను దోషిగా తేల్చిన కోర్టు ఆయనకు 2013లో అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. 2017లో కూడా మరో  రెండు దాణా కుంభకోణం కేసుల్లో లాలూ దోషిగా తేలడంతో కోర్టు ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇదిలా ఉండగా.. వైద్యం కోసం ప్రొవిజనల్‌ బెయిల్‌పై గత మే నెలలో బయటికొచిన లాలూ తిరిగి ఆగస్టు 30న సరెండర్‌ కావాలని రాంచి హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఆయన బిర్సా ముండా సెంట్రల్‌ జైలుకు చేరుకున్నారు. అయితే, పలు ఆనారోగ్య కారణాలతో అదే రోజున ఆయన రిమ్స్‌లో చేరారు. దాదాపు 950 కోట్ల రూపాయల అవినీతి కేసుల్లో లాలూ దోషిగా ఉన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top