కాపురం కూల్చిన వాట్సాప్‌ వీడియో..!

Kerala Woman Fighting For Wrong Attribution To A Nude Video - Sakshi

కొచ్చి : నకిలీ వార్తలు, పుకార్లతో దేశవ్యాప్తంగా అల్లర్లు, ఘర్షణలు చెలరేగి పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు తెలిసిందే. కేరళలోని కొచ్చిలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పొరపాటుగా పోస్టు చేసిన ఓ అడల్ట్‌ వీడియో శోభ అనే వివాహిత జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. వివరాలు.. సాజు జోసెఫ్‌కు చెందిన విద్యుత్‌ పరికరాల కంపెనీలో లిట్టో తంకచన్‌ ఉద్యోగం చేసేవాడు. 2015లో లిట్టో ఓ వాట్సాప్‌ గ్రూప్‌లో న్యూడ్‌ వీడీయో ఒకటి పోస్టు చేశాడు. వీడియోలో ఉన్నది సాజు భార్య శోభ అని పేర్కొన్నాడు. దీంతో సాజు కుటుంబంలో చిచ్చు రేగింది. నగ్నంగా ఉన్న వీడియోను శోభ కావాలనే ఇతరులకు పంపిందని ఆరోపిస్తూ సాజు ముగ్గురు పిల్లలతో కలిసి గత మూడేళ్లుగా ఆమెకు దూరంగా ఉంటున్నారు. భార్యతో విడాకులు మంజూరు చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించాడు. 

లిట్టో అరెస్టు.. శోభకు నరకయాతన
తన పేరును, కుటుంబ పరువును రోడ్డుకీడ్చిన లిట్టోపై శోభ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. వీడియోలో ఉన్నది తాను కాదంటూ.. శోభ సైబర్‌ బ్రాంచ్‌ పోలీసులను ఆశ్రయించారు. అందులో ఉన్నదెవరో తేల్చాలని ఫిర్యాదు చేశారు. కాగా, రంగంలోకి దిగిన సైబర్‌ క్రైం పోలీసులు.. రాష్ట్ర ఫోరెన్సిక్‌ లేబొరేటరీకి వీడియో పంపించి విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా వీడియోలో ఉన్నది శోభ కాదని తేల్చారు. వీడియో అస్పష్టంగా ఉండడంతో  దాని మూలం (ఎక్కడి నుంచి వచ్చిందనే సమాచారం) సైతం కనుక్కోలేకపోతున్నామని ఫోరెన్సిక్‌ లేబొరేటరీ తమ నిసహాయతను తెలియజేసింది.

ఓ వ్యక్తి పొరపాటు వల్ల తన జీవితం నాశనమైందని శోభ (36) వాపోయారు. గత మూడేళ్లుగా తన పిల్లలకు దూరంగా బతకాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అందరిలా నా పిల్లలు.. బయట తిరగకూడదా..! వాళ్ల అమ్మ క్యారెక్టర్‌ గురించి ఎవరైనా నీచంగా మాట్లాడితే వాళ్లు భరిస్తారా’ అని శోభ కన్నీటి పర్యంతం అయ్యారు. వీడియోలో ఉన్నది తాను కాకున్నా తన జీవితంలో తీవ్ర అలజడి రేగిందనీ, ఇప్పటికీ ఆ వీడియో షేర్‌ కాకుండా సైబర్‌ బ్రాంచ్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని శోభ వాపోయారు. ఇదిలాఉండగా.. వీడియో వ్యవహారం ఎలా ఉన్నా.. మళ్లీ శోభను మా జీవితాల్లోకి ఆహ్వానించబోమని సాజు వెల్లడించారు. తామంతా తిరిగి కలిసేది లేదని చెప్పారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top