సామాన్యులే రియల్‌ హీరోలు

Kerala fishermen turn into true heroes for saving flood victims - Sakshi

కేరళ వరదల్లో తమవంతు సాయం చేస్తున్న ప్రజలు  

వారంతా సాధారణ ప్రజలు. ఇతరులకు సాయం చేయడానికి కోట్లకొద్దీ డబ్బు లేదు. చేతిలో అధికారం లేదు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు అవసరమైన అధునాతన పరికరాలు లేవు. ఉన్నదల్లా కేరళ వరదల్లో చిక్కుకున్న వారికి సహాయం చేయాలనే సంకల్పం.  ఆ ఆశయంతోనే ఎంతోమంది సాధారణ ప్రజలు ముందుకు కదిలారు. వారిలో పదేళ్లు కూడా నిండని పిల్లలు, జైలు ఖైదీలూ ఉన్నారు. అలాంటి కొందరు స్ఫూర్తిప్రదాతల గురించి తెలుసుకుందాం.

కిడ్డీ బ్యాంక్‌ ఇచ్చేసింది..
తమిళనాడులోని విల్లుపురానికి చెందిన 9 ఏళ్ల అనుప్రియ సైకిల్‌ కొనుక్కోవాలనే లక్ష్యంతో చాలా రోజుల నుంచి ఒక్కో రూపాయీ పోగేస్తోంది. రూ.9,000దాకా ఆమె కిడ్డీ బ్యాంక్‌లో పోగయ్యాయి. అదే సమయంలో టీవీల్లో కేరళ ప్రజల దైన్యాన్ని చూసి చలించిపోయింది.  సైకిల్‌ కొనుక్కోడానికి దాచిన నగదంతా సహాయక కార్యక్రమాలకు పెద్ద మనసుతో ఇచ్చేసింది ఈ చిన్నారి. ఈ విషయం తెలుసుకున్న హీరో సైకిల్స్‌ సంస్థ బాలికపై ప్రశంసలు కురిపించింది. మానవత్వానికి అనుప్రియను ప్రతీకగా అభివర్ణించిన హీరో సైకిల్స్‌.. ఆమె జీవితాంతం ఏడాదికొక సైకిల్‌ను అనుప్రియకు బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

మత్స్యకారుల మానవీయత
చేపల వేట కోసం రోజూ సముద్రంలోకి వెళ్లే గంగపుత్రులు వారు. లోతైన నీటిలోనూ ఎలాంటి బెరుకూ లేకుండా ఈదడం వారికి వెన్నతో పెట్టిన విద్య. తమకు తెలిసిన విద్యతో కేరళలో వరదల్లో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడాలని వారు తలచారు. అనుకున్నదే తడవుగా సొంత ఖర్చుతోనే తమ పడవలను ట్రక్కుల్లోకి ఎక్కించి తీవ్ర వరద ప్రభావిత ప్రాంతాలకు బయల్దేరారు. వారిలో ఎక్కువగా త్రివేండ్రానికి చెందినవారే ఉన్నారు. మత్స్యకారుల సాయం గురించి తెలుసుకున్న కొందరు ట్రక్కు డ్రైవర్లు, యజమానులు.. వారి పడవలను ఉచితంగానే రవాణా చేశారు. పతనం తిట్ట, ఎర్నాకుళం, త్రిస్సూర్‌ సహా అనేక చోట్ల మత్స్యకారులు రంగంలోకి దిగారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, సహాయక సిబ్బంది తాము చేరుకోలేమంటూ చేతులెత్తేసిన చోటుకి కూడా జాలరులు వెళ్లి ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. కేపీ జైసాల్‌ అనే మత్స్యకారుడు ఇలా బలగాలకు సాధ్యంకాని చోటుకు కూడా చేరుకుని తన వీపును మెట్టుగా మార్చి ముగ్గురు మహిళలను బోటులోకి ఎక్కించి రక్షించడం మనకు తెలిసిందే. ఈ నిజమైన హీరోల సేవలను గుర్తించిన సీఎం విజయన్‌.. వారందరికీ ఒక కొత్త బోటుని, సహాయక చర్యల్లో పాల్గొన్నన్ని రోజులకూ రోజుకు రూ. 3 వేల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు.

నిరాశ్రయులకు ఖైదీల చపాతీలు
వరదల్లో నిరాశ్రయులుగా మారిన వారికి ఆహారం అందించేందుకు త్రివేండ్రం పూజాప్పురలో ఉన్న కేంద్ర కారాగారంలోని ఖైదీలు తీవ్రంగా శ్రమించారు. మంచినీటి సీసాలతోపాటు దాదాపు 50 వేల చపాతీలను ఖైదీలతో తయారు చేయించి జైలు అధికారులు సహాయక బృందాలకు అందజేశారు. నీటిలో చిక్కుకుని ఆహారం కోసం ఎదురుచూస్తున్న వారికి హెలికాప్టర్ల నుంచి జారవిడిచేందుకు తమ చపాతీ ప్యాకెట్లు బాగా ఉపయోగపడ్డాయని అధికారులు చెప్పారు. 2015లో చెన్నైలో వరదల సమయంలోనూ ఇదే జైలు నుంచి 50 వేల చపాతీలను పంపారు. సాధారణ రోజుల్లోనూ ఖైదీలు చపాతీతోపాటు శాకాహార, మాంసాహార వంటకాలను తయారుచేసి త్రివేండ్రంలో ‘ఫ్రీడమ్‌’ బ్రాండ్‌ పేరుతో తక్కువ ధరకే విక్రయిస్తుంటారు.  

ప్రేమతో.. ఫేస్‌బుక్‌ దళం
2015లో చెన్నై వరదల సమయంలో సహాయక కార్యక్రమాల కోసం పురుడుపోసుకున్న ఫేస్‌బుక్‌ గ్రూప్‌ ఒకటి ప్రస్తుతం కేరళలో సహాయక చర్యల్లో పాల్గొంటోంది. నాడు 9 మందితో ప్రారంభమైన ఈ గ్రూప్‌లో నేడు వేలాది మంది ఉండగా దాదాపు 2,000 మంది సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఆ గ్రూప్‌ పేరే ‘అన్బోదు కొచ్చి’ (ప్రేమతో కొచ్చి). కొచ్చిలోని రాజీవ్‌ గాంధీ ఇండోర్‌ స్టేడియంలోనే ఈ గ్రూప్‌లోని 500 మంది ఆహార పదార్థాలు, ఇతర వస్తువులను ప్యాక్‌ చేసి నిరాశ్రయులకు పంపించే పనిలో ఉన్నారు. బిస్కెట్లు, రస్క్, వంట పాత్రలు, దుస్తులు తదితరాలను ప్యాక్‌ చేసి సహాయక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాల ద్వారా అవసరమైన వారికి అందిస్తున్నారు.


కొచ్చిలో ఓ పాఠశాలలో ఏర్పాటుచేసిన తాత్కాలిక శిబిరంలో భోజనం చేస్తున్న ఓ వరదబాధిత చిన్నారి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top