కర్ణాటకకు మరో 14.75 టీఎంసీలు | Karnataka to get additional 14.75 TMC, says Supreme Court | Sakshi
Sakshi News home page

కర్ణాటకకు మరో 14.75 టీఎంసీలు

Feb 17 2018 3:33 AM | Updated on Sep 2 2018 5:18 PM

Karnataka to get additional 14.75 TMC, says Supreme Court - Sakshi

న్యూఢిల్లీ/చెన్నై/బెంగళూరు: తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న కావేరీ నదీ జలాల వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. 2007లో కావేరీ జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌ (సీడబ్ల్యూడీటీ) కేటాయించిన నీటి వాటాల్లో మార్పులు చేస్తూ కర్ణాటకకు మరో 14.75 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశమిచ్చింది. అంతే పరిమాణంలో తమిళనాడుకు కోత విధించింది. కేటాయింపుల్లో తాగు నీటికే తొలి ప్రాధాన్యత అని సీజేఐ జస్టిస్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్‌ తేల్చింది.

బెంగళూరుకు ఉన్న ‘ప్రపంచ స్థాయి నగరం’ హోదాను దృష్టిలో పెట్టుకుని తాజా కేటాయింపులు చేస్తున్నామంది. 14.75 టీఎంసీల్లో బెంగళూరు నగర అవసరాలకోసం 4.75 టీఎంసీల నీటిని కేటాయించింది. ఈ తీర్పుతో ఇరు రాష్ట్రాల సరిహద్దులోని బిలిగుండ్లు నుంచి తమిళనాడుకు కర్ణాటక 177.25 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. ‘బెంగళూరు విస్తీర్ణంలో మూడింట ఒక వంతు మాత్రమే కావేరీ నదీ పరీవాహక ప్రాంతంలో ఉండటంతోపాటు అక్కడ 50 శాతం తాగునీటి అవసరాలు భూగర్భజలాల ద్వారానే తీరుతాయనే ఊహాజనిత కారణాలతో ట్రిబ్యునల్‌ కర్ణాటకకు కేటాయింపులను తగ్గించింది’ అని ధర్మాసనం తీర్పు చెప్పింది.

జాతీయ ఆస్తి.. రాష్ట్రాల సొత్తు కాదు
అంతర్జాతీయ నదీ జలాల సమాన పంపకాలకు సంబంధించిన హెల్సింకి, కాంపియన్, బెర్లిన్‌ నిబంధనలను తాజా తీర్పులో ఉటంకించిన కోర్టు.. నదులు జాతీయ ఆస్తులనీ, ఏ రాష్ట్రం కూడా ఒక నది పూర్తిగా తనకే చెందుతుందని చెప్పుకోజాలదని స్పష్టం చేసింది. ప్రకృతి వరప్రసాదాలైన నదీ జలాలను బాధ్యతాయుతంగా వాడుకునే హక్కు ఆ నది పారుతున్న ప్రతి రాష్ట్రానికీ ఉంటుందని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 363 ప్రకారం ఈ కేసును సుప్రీంకోర్టు విచారించకూడదన్న కేంద్రం వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. కావేరీ జలాల వివాదం విషయమై 2016లో కర్ణాటక, తమిళనాడుల్లో ఘర్షణలు జరిగాయి.

తమిళనాడుకు 404.25, కర్ణాటకకు 284.75
సీడబ్ల్యూడీటీ 2007లో తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిలకు వరుసగా 419, 270, 30, 7 టీఎంసీల నీటిని కేటాయించింది. తాజా తీర్పుతో తమిళనాడుకు 404.25, కర్ణాటకకు 284.75 టీఎంసీల నీళ్లు దక్కనున్నాయి. కేరళ, పుదుచ్చేరిల కేటాయింపుల్లో మాత్రం సుప్రీంకోర్టు ఎలాంటి మార్పులూ చేయలేదు. అలాగే నదీ పరీవాహక ప్రాంతం నుంచి 10 టీఎంసీల భూగర్భ జలాలను తోడుకునేందుకు తమిళనాడుకు అనుమతినిచ్చింది. తీర్పును అమలు చేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించేందుకు కేంద్రానికి ధర్మాసనం ఆరు వారాల గడువిచ్చింది. 15 ఏళ్ల వరకు ఈ కేటాయింపులు అమలవుతాయని ధర్మాసనం తెలిపింది.

తమిళనాడులో ఆందోళనలు
తీర్పు కర్ణాటకకు అనుకూలంగా ఉండటంతో తమిళనాడులో నిరసనలు, ఆందోళనలు మొదలయ్యాయి. అవాంఛిత ఘటనలను నివారించేందుకు ప్రభుత్వం ముందుజాగ్రత్తగా పలుచోట్ల పోలీసులు, భద్రతా దళాలను మోహరించింది.  ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ సుప్రీంకోర్టు కేటాయించిన 177.25 టీఎంసీల నీటిని తీసుకొచ్చేందుకు అంకితభావంతో కృషిచేస్తామన్నారు. తమిళనాడు ప్రభుత్వం అసమర్థతతో కోర్టులో సరైన ఆధారాలు సమర్పించకపోవడం వల్లే తీర్పు కర్ణాటకకు అనుకూలంగా వచ్చిందని ప్రతిపక్ష డీఎంకే పార్టీ ఆరోపించింది. తీర్పు తనకు చాలా అసంతృప్తిని కలిగించిందని  నటుడు రజనీకాంత్‌ అన్నారు. ఇరు రాష్ట్రాల ప్రజలూ గొడవలకు దిగకుండా సామరస్యంగా మెలగాలని  నటుడు కమల్‌ హాసన్‌ సూచించారు.  తమ వాదనలకు అనుగుణంగా తీర్పు లేకపోయినప్పటికీ రాష్ట్రానికి కొంత ఊరట లభించిందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు.

1881 నుంచి వివాదం
► 1881వ సంవత్సరంలో కావేరీ నదిపై డ్యామ్‌ నిర్మించాలన్న అప్పటి మైసూర్‌ సంస్థానం ప్రయత్నాన్ని మద్రాస్‌ ప్రెసిడెన్సీ అడ్డుకోవటంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైంది. ఆ తర్వాత నదీ జలాల పంపిణీపై రెండు ప్రభుత్వాలు 1892, 1924వ సంవత్సరాల్లో వేర్వేరు ఒప్పందాలు కుదుర్చుకోవటంతో వివాదం పరిష్కారమయింది. ఈ ఒప్పందాల కాల పరిమితి 1974లో ముగిసింది.

► 1990 – తమిళనాడు కోరిక మేరకు కేంద్రం కావేరీ జల వివాద ట్రిబ్యునల్‌(సీడబ్ల్యూడీటీ)ను ఏర్పాటు చేసింది.

► 1991 – అత్యవసర సాయంగా కొంతనీరు విడుదల చేయాలన్న తమిళనాడు వినతిని సీడబ్ల్యూడీటీ తిరస్కరించింది. దీంతో తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం సూచనల మేరకు.. తమిళనాడుకు 205 టీఎంసీల నీటిని విడుదల చేయాలని సీడబ్ల్యూడీటీ కోరగా కర్ణాటక పట్టించుకోలేదు. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా కర్ణాటక దిగిరాలేదు. ఈ పరిణామంతో కేంద్రం సీడబ్ల్యూడీటీ మధ్యంతర ఉత్తర్వులను గెజిట్‌లో ప్రచురించింది.

► 1998 – సీడబ్ల్యూడీటీ మధ్యంతర ఉత్తర్వులను అమలు పరిచేందుకు ప్రత్యేకంగా కేంద్రం కావేరి నదీ ప్రాధికార సంస్థ(సీఆర్‌ఏ)ను ఏర్పాటు చేసింది.

► 2007 – ఏర్పాటైన 17 ఏళ్ల తర్వాత కావేరి జలాల పంపిణీ తుది అవార్డును సీడబ్ల్యూడీటీ ప్రకటించింది. నదీ జలాల పంపిణీపై 1892, 1924 సంవత్సరాల్లో కుదిరిన ఒప్పందాల అమలే సరైన పరిష్కారమని అందులో పేర్కొంది.

► 2013 – కావేరి యాజమాన్య బోర్డు(సీఎంబీ) ఏర్పాటు చేయాలని తమిళనాడు కోరడంతో ఆ మేరకు కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

►  2013 మే 28 – సీడబ్ల్యూడీటీ ఆదేశాలను అమలు చేయనందుకు తనకు కలిగిన రూ.2,480 కోట్ల నష్టాన్ని కర్ణాటక చెల్లించాలంటూ తమిళనాడు సుప్రీంకు వెళ్లింది.

►  2013 – నీటి విడుదలపై సీడబ్ల్యూడీటీ ఆదేశాలను అమలు చేయాలన్న తమిళనాడు డిమాండ్‌ సహేతుకం కాదని కావేరీ పర్యవేక్షక కమిటీ పేర్కొంది.  

► 2016 సెప్టెంబర్‌ 11 – కావేరి నీటి విడుదలపై ఉత్తర్వులను సవరించాలని కర్ణాటక వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.


    సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ చెన్నైలో ఆందోళన చేస్తున్న నిరసనకారులు. చెన్నైలో కర్ణాటక బస్సుకు రక్షణగా వెళ్తున్న పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement