జమ్మూకాశ్మీర్ కాంగ్రెస్ సీనియర్ నేత కరణ్ సింగ్‌కు కుమారుడైన అజాతశత్రు సింగ్ ఆదివారం బీజేపీలో చేరనున్నారు.
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ కాంగ్రెస్ సీనియర్ నేత కరణ్ సింగ్ కుమారుడు అజాతశత్రు సింగ్ ఆదివారం బీజేపీలో చేరనున్నారు. పార్టీ సీనియర్ నేతల సమక్షంలో అజాతశత్రు పార్టీలో చేరుతారని బీజేపీ జమ్మూకాశ్మీర్ ఇన్‌చార్జి అవినాశ్ రాయ్ ఖన్నా చెప్పారు.
అజాతశత్రు చేరిక బీజేపీకి ఎంతో లాభిస్తుందని, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జమ్మూ ప్రాంతంలో బీజేపీ అవకాశాలు మరింత మెరుగుపడతాయని చెబుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే యత్నంలో భాగంగా,.. బీజేపీనుంచి బహిష్కృతుడైన చిమన్ లాల్ గుప్తాను కూడా తిరిగి పార్టీలో చేర్చుకున్నారు.
అవినాశ్ రాయ్ ఖన్నా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ,..అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందన్నారు. అజాత శత్రుతోపాటుగా, చిమన్ లాల్ గుప్తా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.