వెబ్‌సైట్‌లో జేఈఈ మెయిన్ కీ | Sakshi
Sakshi News home page

వెబ్‌సైట్‌లో జేఈఈ మెయిన్ కీ

Published Tue, Apr 19 2016 2:54 AM

JEE mains key in the website

22 వరకు అభ్యంతరాల స్వీకరణ
27న జేఈఈ ఫలితాలు.. అందుబాటులో ప్రశ్నపత్రాలు

సాక్షి, హైదరాబాద్:
జేఈఈ మెయిన్ పరీక్ష కీని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) విడుదల చేసింది. ఈ నెల 3న జరిగిన ఆఫ్‌లైన్, 9, 10 తేదీల్లో జరిగిన ఆన్‌లైన్ పరీక్ష కీ పేపర్లను సోమవారం http://jeemain.nic.in వెబ్‌సైట్‌లో ఉంచింది. కీలో ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 22 లోగా తెలియజేయాలని సూచించింది. వాటికి సంబంధించిన ఆధారాలు అప్‌లోడ్ చేయాలని పేర్కొంది. ఇందుకోసం వేర్వేరుగా లింక్‌లను ఇచ్చింది. అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్, పాస్‌వర్డ్ పొందుపరిచి కీలను పొందొచ్చని తెలిపింది. అలాగే జేఈఈ మెయిన్ పరీక్షల ప్రశ్న పత్రాలను కూడా అందుబాటులో ఉంచింది.

ఆఫ్‌లైన్ పరీక్షకు సంబంధించిన ఈ, ఎఫ్, జీ, హెచ్ కోడ్ ప్రశ్న పత్రాలు, 9, 10 తేదీల్లో జరిగిన ఆన్‌లైన్ పరీక్ష ప్రశ్నపత్రాలను కూడా వెబ్‌సైట్‌లో ఉంచింది. ఇక ఫలితాలను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఇక ఆల్ ఇండియా ర్యాంకులను జూన్ 30న లేదా అంతకన్నా ముందే విడుదల చేస్తామని వివరించింది. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి 59,731 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 70 వేలమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

29 నుంచి అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులు
ఈనెల 29 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ కోసం విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఐఐటీ గువాహటి చర్యలు చేపట్టింది. జేఈఈ మెయిన్‌లో అత ్యధిక మార్కులు సాధించిన టాప్ 2 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హులుగా ప్రకటించింది. ఐఐ టీల్లో ప్రవేశాల కోసం మే 22న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పేపరు-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపరు-2 పరీక్ష జరగనుంది. వాటి ఫలితాలను జూన్ 12న ప్రకటించి, జూన్ 20న సీట్లు కేటాయించనుంది.

Advertisement
Advertisement