సౌర సుజల యోజనతో..

Jashpur famers reaping profits by cultivating chilly - Sakshi

లక్షలు సంపాదిస్తున్న ఛత్తీస్‌ రైతులు

రాయ్‌పూర్‌: అది మారుమూల గిరిజన కొండ ప్రాంతం. అక్కడి రైతులకు ఎలాంటి ఆదాయ మార్గాలులేవు. కనీసం విద్యుత్‌ కూడా ఉండేది కాదు. దీంతో పూట గడవడమే కష్టంగా ఉండేది. అలాంటి సమయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం వారికి వరంలా మారింది. రెండేళ్లలో వారి దశ తిరిగింది. ఆదాయం లక్షల్లోకి చేరింది. ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్‌ జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సౌర సుజల యోజన’ పుణ్యమే ఇదంతా. గిరిజనులు ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో ఈ పథకం కింద మిరప వంటి పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించింది. విద్యుత్‌ సౌకర్యం లేని ప్రాంతాల్లోని రైతులకు తక్కువ ధరకే సౌర విద్యుత్‌ పంప్‌సెట్లు సమకూర్చింది. కోపా గ్రామానికి చెందిన గుజ్‌నాథ్‌ రామ్‌ ఆహార పంటలను సాగుచేస్తూ సరైన దిగుబడులు రాక ఇబ్బందులు పడుతుండేవాడు.

ఈ పథకం అమలు తర్వాత తనకున్న ఐదెకరాల్లో రెండేళ్లుగా ఆయన మిర్చితోపాటు, టమాటా, వరి కూడా సాగు చేస్తున్నారు. రామ్‌ ఏమంటున్నారంటే.. ‘ఇప్పటి వరకు వచ్చిన మిర్చి, టమాటాలను విక్రయించగా రూ.80వేలు వచ్చాయి. ఆగస్టు, సెప్టెంబర్‌ వరకు కూడా దిగుబడులు చేతికందుతాయి. ఇలా ఎకరానికి రూ.లక్ష వరకు మిగులుతాయి’. ‘సౌర్‌ సుజల యోజన’ ద్వారా లబ్ధి పొందుతున్న బగీచా, మనోరా ప్రాంతాల్లోని 50 గ్రామాలకు చెందిన 500 మంది రైతుల్లో రామ్‌ కూడా ఒకరు. ‘2016 వరకు జిల్లాలో కేవలం 300 ఎకరాల్లో మాత్రమే మిరప సాగు జరుగుతుండేది. ఇప్పుడు అది రెండువేల ఎకరాలకు పెరిగింది. దీంతో ఇక్కడి రైతుల జీవనప్రమాణాల్లో గణనీయ మార్పులు వచ్చాయి’ అని జష్‌పూర్‌ జాయింట్‌ కలెక్టర్‌ ప్రియాంక శుక్లా తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top