జైరాం ప్రశ్న.. వెంకయ్య జవాబు
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్ర అవినీతి, బంధుప్రీతి ఆరోపణలు చేశారు.
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్ర అవినీతి, బంధుప్రీతి ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించి 4 అంశాలను ఆధారాలతో పాటు బయట పెడుతున్నానని, వీటికి వెంకయ్య తక్షణం బదులివ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా జీవితంలో ఉన్నవారిపై అవినీతి ఆరోపణలుండరాదని చెప్పిన ప్రధాని మోదీ దీనిపై ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు. జైరాం ఆరోపణలన్నీ అవాస్తవాలని వెంకయ్య కొట్టిపారేశారు. ‘‘ఇదంతా రాజకీయ కక్ష సాధింపే. ఈ ప్రశ్నలకు నేనెప్పుడో బదులిచ్చాను. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందు రాజకీయ దురుద్దేశంతోనే మళ్లీ తెరపైకి తెస్తున్నారు. ఇది కాంగ్రెస్ రాజకీయ దివాళాకోరుతనానికి ఉదాహరణ’’ అంటూ విమర్శించారు. ప్రజలు వాస్తవం తెలుసుకోవాల్సి ఉందంటూ ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
– సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ
1 జైరాం: వెంకయ్య కూతురు దీప ఆధ్వర్యంలో నడుస్తున్న స్వర్ణ భారత్ ట్రస్టుకు 2017 జూన్ 20న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ రూ.2 కోట్ల పన్ను మినహాయింపు ఇవ్వడం నిజం కాదా?
వెంకయ్య: సమాజసేవను ప్రోత్సహించేందుకే తెలంగాణ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. మా ట్రస్టుకే కాకుండా చాలా స్వచ్ఛంద సంస్థలకు మినహాయింపు ఇచ్చామంటూ స్పష్టత ఇచ్చింది. ఓ స్వచ్ఛంద సంస్థగా నైపుణ్యాభివృద్ధి తదితరాలకు శిక్షణ ఇస్తున్నందుకే మినహాయింపు ఇచ్చామని చెప్పింది.
2 జైరాం: వెంకయ్య కుమారుడు యజమానిగా ఉన్న హర్ష టొయోటా, కేసీఆర్ కుమారుడు యజమానిగా ఉన్న హిమాన్షు మోటార్స్‌తో పోలీసు వాహనాల కోసం 2014 జూలైలో నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు వేయకుండానే రూ.271 కోట్ల ఒప్పందం కుదుర్చుకోవడం నిజం కాదా?
వెంకయ్య: మా పిల్లల వ్యాపారానికి నేను చాలా దూరంగా ఉంటాను. తెలంగాణ ప్రభుత్వం హర్ష టొయోటాతో నేరుగా ఒప్పందం కుదుర్చుకోలేదు. టొయోటా కిర్లోస్కర్ (తయారీదారు)తోనే కుదుర్చుకుంది. చెల్లింపు కూడా టయోటా కిర్లోస్కర్‌కే జరిగింది. దీనితోనూ, సరఫరాతోనూ హర్ష టొయోటాకు సంబంధమే లేదు.
3 జైరాం: భోపాల్‌లోని షాపురాలో వందల కోట్ల విలువైన 20 ఎకరాలను 2004 సెప్టెంబర్ 25న వెంకయ్య చైర్మన్‌గా ఉన్న కుశభావ్ ఠాక్రే మెమోరియల్ ట్రస్టుకు కట్టబెట్టడం అబద్ధమా? మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం రూ.25 లక్షల ప్రీమియం, అదీ ఒకసారి మాత్రమే చెల్లించేలా, ఏడాదికి రూ.1 అద్దె చెల్లించేలా భూమి కట్టబెట్టలేదా? ఈ ఒప్పందాన్ని 2011 ఏప్రిల్ 6న సుప్రీంకోర్టు తిరస్కరించడం నిజం కాదా?
వెంకయ్య: అప్పట్లో నేను బీజేపీ జాతీయాధ్యక్షుడి హోదాలో మాత్రమే ఆ ట్రస్టుకు చైర్మన్‌గా ఉన్నా. భూ కేటాయింపులో నాకు సంబం ధమే లేదు. ట్రస్టులకు ఈ పద్ధతిలోనే భూములు కేటాయిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వాలున్న చోటా ఇలాంటి నిబంధనలే ఉంటాయి.
4 జైరాం: వెంకయ్య బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉండగా నెల్లూరులో నిరుపేదలకు కేటాయించిన 4.95 ఎకరాలను లాక్కున్నట్లు ఆరోపణలున్నాయి. అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రజలు ఆగ్రహించటంతో 2002 ఆగస్టు 17న ఆ భూమిని పేదలకే తిరిగి అప్పగించడం నిజం కాదా?
వెంకయ్య: దీన్ని 2002లోనే స్థానిక కాంగ్రెస్ నేత లేవనెత్తారు. కోర్టుకెళ్లారు. భూమిని లాక్కున్నారనే ఆరోపణలను కోర్టులు కొట్టేశాయి.