
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో జాతీయ రహదారులుగా గుర్తించిన పలు రహదారులకు నంబరింగ్ ఇచ్చి పనులు ప్రారంభించాల్సిందిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మంత్రి జగదీశ్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎంపీలు నామా నాగేశ్వరరావు, లింగయ్యయాదవ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్కసుమన్, సునీత తదితరులతో కలిసి గడ్కరీని ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రాసిన లేఖను అందజేశారు. రాష్ట్రంలో 3,150 కి.మీ. జాతీయ రహదారులు కేటాయిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని, అందులో 600 కి.మీ. రహదారులకు నంబరింగ్ ఇవ్వాల్సి ఉందన్నారు. హైదరాబాద్–భూపాలపల్లి ఎన్‌హెచ్–163 మీద రెండు చోట్ల అండర్ పాస్‌లు మంజూరు చేయాలని ఆయన కోరారు.