అంతసొమ్ము ఎక్కడిదమ్మా?

IT Department Question to Sasikala in Jail - Sakshi

జైల్లో శశికళను విచారించిన ఐటీ అధికారులు

రూ.3వేల కోట్లకు పైగా సొత్తుపై ప్రశ్నల పరంపర

శుక్రవారం సైతం కొనసాగనున్న విచారణ

మరో కేసు పెట్టే అవకాశం

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో నాలుగేళ్ల శిక్షను అనుభిస్తున్న శశికళను ఆదాయపు పన్నుశాఖ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించి ఉక్కిరిబిక్కిరి చేశారు. అంత సొమ్ము ఎక్కడిదమ్మా అంటూ ఆరాతీశారు. ఐదుగురితో కూడిన చెన్నై ఐటీ బృందం గురువారం ఉదయం బెంగళూరు జైలులో శశికళను విచారించడం ప్రారంభించింది.శుక్రవారం సైతం విచారణకొనసాగనుంది.

సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత హయాంలో అన్నీ తానై చక్రం తిప్పిన శశికళ తెరవెనుక సీఎంగా పేరు గడించారు. జయ వెన్నంటి ఉంటూ ఆమె బంధు, మిత్రగణానికి ‘సర్వం’ సమకూర్చారు. ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టినట్లు న్యాయస్థానంలో రుజువుకావడంతో బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ప్రస్తుతం శిక్షను అనుభవిస్తున్నారు. ఇదిలా ఉండగా, చెన్నైలో శశికళకు సొంత ఇల్లు, ఆమె భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఆనేక కంపెనీలు, అక్క కుమారుడు టీటీవీ దినకరన్, సోదరుని కుమారుడు వివేక్, బంధువులు, బినామీలకు సంబంధించి 187 చోట్ల ఐటీ అధికారులు గత ఏడాది ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడులు, తనిఖీల్లో 60కిపైగా బినామీ సంస్థలు బయటపడ్డాయి. అంతేగాక 150కి పైగా బ్యాంకు ఖాతాల ద్వారా రూ.3వేల కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు కనుగొన్నారు. ఈ సొమ్ముకు సంబంధించి శశికళ రక్తసంబంధీకులు, బంధువులు, భాగస్వాములు, స్నేహితులను ఐటీ అధికారులు తమ కార్యాలయానికి పిలిపించుకుని విచారించారు. అంతేగాక బినామీల సొత్తును జప్తు చేశారు. జప్తుచేసిన ఆస్తులపై విచారణ కొనసాగుతోంది. అయితే అన్ని ఆస్తులను కూడబెట్టడంలో సూత్రధారి, పాత్ర«ధారి అయిన శశికళను మాత్రం ఇన్నాళ్లూ విచారించలేదు.

విచారణకు జైలు అధికారుల అనుమతి
శశికళను విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ బెంగళూరు జైలు అ«ధికారులకు ఐటీ అధికారులు ఇటీవల ఉత్తరం రాశారు. ఈ ఉత్తరాన్ని పరిశీలించిన జైలు అధికారులు విచారణకు అనుమతించారు. ఈ అనుమతిని అనుసరించి డిసెంబర్‌ 13, 14 తేదీలను విచారణకు నిర్ణయించుకుని జైలు అధికారులకు కబురంపారు. ఈ మేరకు  చెన్నై ఐటీ కార్యాలయం నుంచి ఐదుగురితో కూడిన అధికారుల బృందం గురువారం ఉదయం 10.30 గంటలకు జైలుకు చేరుకుంది. గత ఏడాది నిర్వహించిన ఐటీ దాడుల్లో బయటపడిన రూ.3వేల కోట్లకు పైగా ఆస్తులపై ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. అంత సొమ్ము ఎక్కడిది అనే కోణంలో గురు, శుక్రవారాల్లో సుమారు 500 పైగా ప్రశ్నలను సంధించనున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణ పూర్తికాగానే శశికళపై మరో కేసు పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top