లిప్స్టిక్ వేసి.. పెర్ఫ్యూమ్ రాసి | Sakshi
Sakshi News home page

లిప్స్టిక్ వేసి.. పెర్ఫ్యూమ్ రాసి

Published Sat, Sep 5 2015 10:56 AM

లిప్స్టిక్ వేసి.. పెర్ఫ్యూమ్ రాసి

ముంబయి: సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో రోజురోజుకు  కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. షీనా బోరాను హత్య చేసిన అనంతరం ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జియా ... మృతదేహానికి లిప్ స్టిక్ రాయడంతో పాటు తలను కూడా అందంగా దువ్వి ముస్తాబు చేసిందట. ఈ విషయాన్ని షీనా కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు వెల్లడించారు. ఎటువంటి చెడువాసన రావద్దని ఆలోచించిందే ఏమో కానీ, షీనా మృతదేహానికి పెర్ఫ్యూమ్ కూడా రాసింది. ఆ తర్వాత మృతదేహాన్ని రాయ్ గఢ్ తీసుకెళ్లి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్ తో కలిసి దహనం చేసింది.

అయితే మార్గమధ్యలో పోలీసులు తనిఖీల్లో భాగంగా కారులో ఉన్న  షీనా బోరా గురించి ప్రశ్నించగా ఆమెకు ఆరోగ్యం బాగాలేదని నిద్రపోతుందని ఇంద్రాణి చెప్పినట్లు ఓ అధికారి వెల్లడించారు.  షీనాను హత్య చేసిన రోజు (ఏప్రిల్ 24, 2012) వర్లీలోని ఇంద్రాణీ ఇంట్లోనే షీనా మృతదేహాన్ని ఉంచారు.మరుసటి రోజు ఉదయం మృతదేహాన్ని కారులో తరలిస్తూ.. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు లిప్ స్టిక్, పెర్ఫ్యూమ్ ఆమెకు రాయడం తల దువ్వడం వంటివి చేసినట్లు పోలీసుల విచారణలో ఇంద్రాణీ వివరించింది. కాగా పోలీస్ కస్టడీ నేటితో ముగియనుండటంతో ఇంద్రాణీ ముఖర్జియాను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

షీనా హత్య తర్వాత మెయిల్ ఐడీ క్రియేట్..
షీనా హత్య అనంతరం మృతదేహం ఆనవాళ్లు కూడా గుర్తించడం కష్టమని భావించిన ఇంద్రాణీ.. ఓ ఉద్యోగికి చెప్పి కూతురి పేరిట హాట్ మెయిల్ అకౌంట్ క్రియేట్ చేయించింది. అయితే షీనా అమెరికాలో చాలా బిజీగా ఉన్నట్లు ఆ ఉద్యోగికి చెప్పి అకౌంట్ ఓపెన్ చేయించి.. ఆ ఐడీ నుంచి చాలా మందికి ఇంద్రాణీ ఈమెయిల్స్ పంపినట్లు అంగీకరించింది. 

Advertisement
 
Advertisement