‘ఉగ్ర’రహిత ప్రపంచం కావాలి

 India-Iran Sign 9 Agreements, Focus On Chabahar Port - Sakshi

ఇరాన్‌ అధ్యక్షుడితో చర్చల అనంతరం మోదీ

ఐరాస మండలిలో శాశ్వత సభ్యత్వానికి రౌహానీ మద్దతు

న్యూఢిల్లీ: భారత్, ఇరాన్‌లు ఉగ్రవాద రహిత ప్రపంచాన్ని కోరుకుంటున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం అన్నారు. ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనతో సమావేశమైన మోదీ పలు అంశాలపై విస్తృత చర్చలు జరిపారు. అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. అనంతరం రౌహానీతో కలసి మోదీ సంయుక్త విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ మోదీ మాట్లాడుతూ ఉగ్రవాదం, తీవ్రవాదం, మత్తు పదార్థాల రవాణా, సైబర్‌ నేరాలు తదితరాలను ప్రోత్సహిస్తున్న శక్తులను నిలువరించేందుకు ఇరు దేశాలూ కట్టుబడి ఉన్నాయన్నారు.

ఇరాన్‌లో భారత్‌ అభివృద్ధి చేస్తున్న చాబహర్‌ నౌకాశ్రయాన్ని ఆయన స్వర్ణ ద్వారంగా అభివర్ణించారు. రౌహానీ మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరు విషయంలో ఇరాన్, భారత్‌ ఉమ్మడి వైఖరిని అవలంభిస్తున్నాయని అన్నారు. భారత్, ఇరాన్‌ల మధ్య రాజకీయ, రాయబారాలకు మించిన చారిత్రక సంబంధం ఉందని రౌహానీ అన్నారు. ప్రాంతీయ సమస్యలను రాజకీయ చర్యలు, రాయబారాలతోనే పరిష్కరించుకోవాలని సూచించారు.

ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలతో కలసి తాను కుదుర్చుకున్న అణు ఒప్పందానికి ఇరాన్‌ ఎప్పటికీ లోబడి ఉంటుందని రౌహానీ అన్నారు. ఈ ఒప్పందం రద్దయితే అమెరికా చింతించాల్సి ఉంటుందని హెచ్చరించారు.ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి అనుకూలంగా రౌహానీ మాట్లాడారు. 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌కు భద్రతా మండలిలో వీటో అధికారాలు ఎందుకు లేవనీ, అణు బాంబులు కలిగిన వారికి కూడా వీటో అధికారాలు ఉన్నాయంటూ ఆయన భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతు పలికారు.

9 ఒప్పందాలపై సంతకాలు
ఉగ్రవాదం, భద్రత, వాణిజ్యం, ఇంధనం తదితరాల అంశాలపై చర్చల అనంతరం ఇరు దేశాల మధ్య 9 ఒప్పందాలు కుదిరాయి. చాబహర్‌ నౌకాశ్రయంలో కార్యకలాపాలను భారత్‌ నిర్వహించేందుకు అవసరమైన ఒప్పందం, ద్వంద్వ పన్నులు, పన్నుల ఎగవేతను నివారించడం, రాయబార పాస్‌పోర్టులు కలిగిన వారికి వీసాల నుంచి మినహాయింపునివ్వడం, వైద్యం, ఇంధన రంగాలకు సంబంధించిన ఒప్పందాలు వాటిలో ఉన్నాయి.

ఇరు దేశాల అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ తొమ్మిదింటితోపాటు రౌహానీ పర్యటన సందర్భంగా మరో 4 ఒప్పందాలు కూడా ఇరు దేశాల మధ్య కుదిరాయని భారత విదేశాంగ శాఖ అధికారులు చెప్పారు. జమ్మూ కశ్మీర్‌లో పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న అంశం మోదీ, రౌహానీల చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందా అని ప్రశ్నించగా, భారత్‌ ఉగ్రవాద బాధిత దేశమని ప్రపంచానికి తెలుసునంటూ అధికారులు పరోక్షంగా సమాధానమిచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top